అనకాపల్లి:
అనకాపల్లి జిల్లా తగరంపూడి గ్రామంలో దివంగత కాపు నేత, మాజీ మంత్రి గుడివాడ గురునాధ రావు గారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దుశ్చర్యపై స్థానిక వైయస్‌ఆర్‌సీపీ నాయకులు మరియు కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే వైయస్‌ఆర్‌సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్ గారు, ఎంపీపీ గొర్లి సూరిబాబు గారు, పార్టీ సీనియర్ నాయకులు మందపాటి జానకిరామరాజు గారు, జాజుల రమేష్ గారు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించిన నాయకులు, ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. "నిరుపేదల పెన్నిధి, కాపు సామాజిక వర్గ గొప్ప నాయకుడు గురునాధ రావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత హేయమైన చర్య. రాజకీయ లబ్ధి కోసం లేదా ఉద్దేశపూర్వకంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే తలంపుతోనే ఇటువంటి పనులకు పాల్పడుతున్నారు" అని మండిపడ్డారు.
వైయస్‌ఆర్‌సీపీ నేతల డిమాండ్లు:విగ్రహ ధ్వంసానికి పాల్పడిన దోషులను పోలీసులు వెంటనే గుర్తించి, అరెస్టు చేయాలి.నిందితులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలి.
ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడి విగ్రహాన్ని అవమానించడం అంటే ఆ ప్రాంత ప్రజలను అవమానించడమేనని, దోషులను పట్టుకునే వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా నేతలు హెచ్చరించారు.