సిబ్బంది సంక్షేమమే మా ధ్యేయం: విజయవంతంగా ‘SP-SAMPARK’ ఫోన్-ఇన్ కార్యక్రమం
20/March/2026 17:08
Share:
నేరుగా జిల్లా ఎస్పీ గారితో మాట్లాడిన పోలీసు సిబ్బంది.
సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు జారీ చేసిన ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్.
అనకాపల్లి, మార్చి 20: జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన ‘SP-SAMPARK’ ఫోన్-ఇన్ కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం విజయవంతంగా నిర్వహించబడింది. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు స్వయంగా ఫోన్ లైన్ ద్వారా సిబ్బంది సమస్యలను ఆలకించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టారు.
నాయకత్వానికి మరియు క్షేత్రస్థాయి సిబ్బందికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, సిబ్బంది తమ వ్యక్తిగత లేదా వృత్తిపరమైన ఇబ్బందులను ఎటువంటి సంకోచం లేకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చేలా ఈ వేదికను రూపొందించారు. జిల్లావ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది 93469 12011 నంబర్ ద్వారా ఎస్పీ గారితో నేరుగా మాట్లాడారు.
ముఖ్యంగా సర్వీస్ పరమైన పోస్టింగ్స్, బదిలీలు, సెలవులు మరియు కుటుంబ ఆరోగ్య సమస్యల గురించి సిబ్బంది ఎస్పీ గారికి వివరించారు. ప్రతి సమస్యను లోతుగా విశ్లేషించిన ఆయన, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు మాట్లాడుతూ: "పోలీస్ సిబ్బంది సమస్యలను పరిష్కరించడమే మా ప్రధమ ప్రాధాన్యత. దూర ప్రాంతాల నుండి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, సిబ్బంది తమ సమస్యలను నేరుగా నాతో పంచుకోవచ్చు. ప్రతి ఫిర్యాదును గోప్యంగా ఉంచుతూ త్వరితగతిన పరిష్కారం చూపుతాం," అని పేర్కొన్నారు.
ముఖ్య సమాచారం:
ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది.
ప్రతి ఫిర్యాదును డిజిటల్ రిజిస్టర్‌లో నమోదు చేసి, పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు, ఎస్సై ప్రసాద్, ఆఫీస్ సూపరింటెండెంట్ గిరి మరియు ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.