కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,
ఏలూరు,
జలధార-జలహారతి కార్యక్రమంలో చేపట్టిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జలధార-జలహారతి కార్యక్రమంలో చేపట్టిన పనుల ప్రగతిపై శనివారం సాయంత్రం డ్వామా, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులు, ఎంపిడిఓలతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జలధార-జలహారతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, కురిసిన ప్రతీ వర్షం నీటిని పరిరక్షించే విధంగా జలధార-జలహారతి పనులు ఉండాలని, నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయకుండా నిర్లక్ష్యం వహించే ఎంపిడిఓ లు, డ్వామా ఏపిఓ లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తానని కలెక్టర్ హెచ్చరించారు.
*ఇరిగేషన్ ఓ అండ్ ఎం పనులు వెంటనే పూర్తి చేయాలి: ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ ఆదేశం:* కాలువలకు నీటి విడుదల తేదీ సమీపిస్తున్న దృష్ట్యా ఇరిగేషన్ శాఖ ద్వారా చేపట్టిన ఓ అండ్ ఎం పనులు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కాల్వల పూడికతీత, గట్లు పటిష్టత, తదితర పనులను నీటి విడుదల ముందుగానే పూర్తిచేయాలన్నారు. పనులు పూర్తి నాణ్యతతో ఉండాలని, తూ తూ మంత్రంగా నాణ్యతాలోపంతో పనులు చేపడితే విచారణ చేసి నాణ్యతను ధృవీకరించిన సిబ్బంది, పర్యవేక్షించిన అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.
డ్వామా పీడీ సుబ్బారావు, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ దేవప్రకాష్, ఎంపిడిఓ లు, డ్వామా ఏపిఓలు, ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.