ర్యాష్ డ్రైవింగ్ చేస్తే జైలుకే.. ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్!
19/May/2026 08:06
Share:
అనకాపల్లి పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. ద్విచక్ర వాహనాలపై అతివేగంగా, నిర్లక్ష్యంగా దూసుకెళ్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఆకతాయిలపై ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఎస్డీపీవో ఎం. శ్రావణి ఆదేశాలతో.. టౌన్ పరిధిలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎం. వెంకట నారాయణ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు.ముఖ్యంగా నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలు, అధిక శబ్దం చేస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు ఐదుగురిపై కేసులు నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు.ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజల ప్రాణాలకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. రానున్న రోజుల్లో కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కఠినంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
శ్రీనివాస్.ఏ,క్రైమ్ ఎనాలిసిస్, జిల్లా ఇన్చార్జ్.అనకాపల్లి.