కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు
ఏలూరు: పుట్టి పెరిగిన ఊరు బాగుండాలనే తపనతో, సమాజ హితం కోసం ఒక మహిళ గత కొంతకాలంగా ఏలూరు నగరంలో చేస్తున్న పోరాటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆమె పోరాడుతోంది తన సొంత ఆస్తుల కోసమో లేక కుటుంబ వ్యవహారాల కోసమో కాదు. ఏలూరు నగరం పచ్చగా, పరిశుభ్రంగా ఉండాలన్నదే ఆమె ఏకైక లక్ష్యం.
నగరంలోని ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజీలను కొంతమంది స్వార్థపరులు అక్రమంగా ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. దీనివల్ల డ్రైనేజీల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి పారిశుధ్య సిబ్బందికి వీలు పడటం లేదు. ఫలితంగా మురుగునీరు రోడ్లపైకి చేరి దోమలు, అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. అంతేకాకుండా, డ్రైనేజీల ఆక్రమణల కారణంగా సాధారణ ప్రజలు, పాదచారులు నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ ప్రజా సమస్యలపై సదరు మహిళ నిరంతరం అధికారుల చుట్టూ తిరుగుతూ, వినతిపత్రాలు సమర్పిస్తూ నిరసన తెలుపుతున్నారు. అయితే, ఏలూరు జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) ఈ ప్రజా సమస్యను, ఆమె చేస్తున్న పోరాటాన్ని ఎందుకు పక్కన పెడుతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఆమె లేవనెత్తిన అంశాలు నిజమా కాదా అని క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్ధారణ చేసుకుని తక్షణమే న్యాయం చేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజా సమస్యలపై స్పందించి కలెక్టరేట్ కార్యాలయం, ఉన్నతాధికారులు స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.