యలమంచిలి, మే 23: బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు సోదరులు లారీ డ్రైవర్లుగా పనిచేస్తూ, ఆస్తులు మరియు భార్యల విషయాల్లో నిరంతరం గొడవలు పడుకుంటున్నారు. ఈ క్రమంలో తీవ్ర వివాదం ప్రాణాంతకంగా మారింది.పోలీసుల కథనం ప్రకారం, రాజీవ్ కుమార్ రాయ్ (30) మరియు సంజీవ్ కుమార్ రాయ్ (29) అనే అన్నదమ్ములు తమ లారీ డ్రైవింగ్ విధిలో భాగంగా నిన్న (22.05.2026) రాత్రి 7 గంటల సమయంలో యలమంచిలి మండలం, పోతిరెడ్డిపాలెం జంక్షన్ సమీపంలో రోడ్డు పక్కన లారీలను ఆపారు. అక్కడ వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.ఆవేశంలో అన్నయ్య రాజీవ్ కుమార్ రాయ్, తన లారీలోని జాకీ ఐరన్ రాడ్తో తమ్ముడు సంజీవ్ కుమార్ రాయ్ తల వెనుక భాగంలో బలంగా కొట్టాడు. దీంతో సంజీవ్కు తలకు తీవ్ర రక్తగాయం అయి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. నేరం చేసిన రాజీవ్ వెంటనే తన లారీతో అక్కడి నుంచి పరారీ అయ్యాడు.ఈ ఘటనపై చిన్న తమ్ముడు రణధీర్ కుమార్ రాయ్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
