24 గంటల్లోనే దొంగతనం కేసును ఛేదించిన అనకాపల్లి టౌన్ పోలీసులు..
20/November/2026 19:44
Share:
నిందితుడి అరెస్ట్ – 40.590 గ్రాముల బంగారు ఆభరణాల స్వాధీనం
అనకాపల్లి | నవంబర్ 20 | క్రైమ్ నెం: 212/2026, U/S 305(a) BNS-2023 అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అనకాపల్లి టౌన్ సి.ఐ జి.ప్రేమ కుమార్ గారి పర్యవేక్షణలో టౌన్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, ఫిర్యాదు అందిన 24 గంటల్లోపే ఒక ఇంటి దొంగతనం కేసును ఛేదించారు. ఈ కేసులో పాత నేరస్తుడైన నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి 40.590 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి పట్టణం, శారదా నగర్ కాలనీ 15వ వీధికి చెందిన మొహమ్మద్ యూసుఫ్ ఇస్మాయిల్ (తండ్రి: అబ్దుల్ గఫూర్) గారు ఈ నెల 14న ఇంటికి తాళం వేసి, పండగ నిమిత్తం నర్సీపట్నం సమీపంలోని కోటవురట్ల గ్రామానికి వెళ్లారు. తిరిగి 19.11.2026న ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపులు, బీరువా తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు దొంగిలించబడినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో Cr.No. 212/2026 U/S 305(a) BNS-2023 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వేగంగా దర్యాప్తు చేపట్టిన అనకాపల్లి టౌన్ ఎస్.ఐ అల్లు వెంకటేశ్వరరావు గారు తన సిబ్బందితో కలిసి, తేదీ 20.11.2026 మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో అనకాపల్లి పట్టణంలోని పూడిమడక బైపాస్ జంక్షన్ సర్వీస్ రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. నిందితుడిని విచారించగా నేరాన్ని అంగీకరించడంతో దొంగిలించిన సొత్తును పూర్తిస్థాయిలో రికవరీ చేశారు. అనంతరం నిందితుడిని గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. అరెస్టయిన నిందితుడి వివరాలు: పేరు: కోన రాకేష్ (తండ్రి: లేటు శ్రీరాములు), వయస్సు: 23 సంవత్సరాలు, వృత్తి: క్యాటరింగ్ బాయ్, ప్రస్తుత నివాసం: 10వ వీధి, శారదా నగర్ కాలనీ, అనకాపల్లి పట్టణం, నిందితుడు కోన రాకేష్‌పై గతంలో అనకాపల్లి టౌన్ మరియు ఎస్. రాయవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు దొంగతనం కేసులు, మునగపాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం కేసు నమోదై ఉన్నాయని, ఆ కేసుల్లో ఇతను గతంలో అరెస్ట్ అయ్యాడని పోలీసులు తెలిపారు. అరెస్టయిన నిందితుడి వద్ద నుండి ఈ కేసులో దొంగిలించబడిన సుమారు 40.590 గ్రాముల బరువుగల బంగారు ఆభరణాలను పోలీసులు పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 31.330 గ్రాముల బరువుగల రెండు పేటల బంగారు చైను, 6.050 గ్రాముల బరువుగల ఒక జత బంగారు చెవిదిద్దులు మరియు 3.190 గ్రాముల బరువుగల ఒక బంగారు ఉంగరం ఉన్నాయి. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకుని సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఎస్.ఐ అల్లు వెంకటేశ్వరరావు మరియు సిబ్బంది PC-2178 M.సముద్రం, PC-2291 R.P.నాయుడు, PC-2342 T.S.నాయుడు లను జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు.