బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే సెక్యూరిటీ బాండ్ మొత్తాన్ని రికవరీ చేస్తాం..

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే సెక్యూరిటీ బాండ్ మొత్తాన్ని రికవరీ చేస్తాం..

20/November/2026 19:39    Share:   

- విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్, ఐపీఎస్

గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన ముందస్తు చర్యలు చేపడుతున్నదని, ఇందులో భాగంగా ఇప్పటికే 26వేల మందిపై బైండోవరు కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్, ఐపీఎస్ గారు నవంబరు 20న తెలిపారు.

జిల్లా ఎస్పీ శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ గారు మాట్లాడుతూ - ఎన్నికల సమయంలో గ్రామాల్లో వర్గ విభేదాలు, పాత కక్షలు, రాజకీయ విభేదాల కారణంగా గొడవలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులను ముందుగానే గుర్తించి, వారిపై బైండోవర్ చర్యలు చేపడుతున్నామన్నారు. సంబంధిత వ్యక్తులను మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి, ఎన్నికల సమయంలో ఎటువంటి గొడవలకు, అల్లర్లకు పాల్పడకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా మంచి ప్రవర్తనతో వ్యవహరిస్తామని స్వంత పూచీకత్తుతో కూడిన సెక్యూరిటీ బాండ్లను స్వీకరిస్తున్నామన్నారు.

జిల్లాలో ఇప్పటివరకు సుమారు 26 వేల మందిపై బైండోవర్ చర్యలు చేపట్టి, ఒక్కొక్కరి నుండి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు స్వంత పూచీకత్తుతో సెక్యూరిటీ బాండ్లు స్వీకరించినట్లుగా ఎస్పీ గారు తెలిపారు.

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలు:

* మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట బాండ్ ఇచ్చిన వ్యక్తులు, బాండ్ అమలులో ఉన్న సమయంలో బాండులో పేర్కొన్న షరతులను తప్పనిసరిగా పాటించాలి.

* బాండ్ ఇచ్చిన తరువాత కూడా ఎన్నికల సందర్భంగా గొడవలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, బెదిరింపులకు దిగినా లేదా ఇతర నేరాలకు పాల్పడినా వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు చేపడతారన్నారు.

* బాండ్ షరతులను ఉల్లంఘించినట్లుగా నిర్ధారణ అయితే, సంబంధిత ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ చట్ట ప్రకారం విచారణ జరిపి, స్వంత పూచీకత్తుగా ఇచ్చిన బాండ్ మొత్తాన్ని జప్తు చేయడం లేదా జరిమానగా వసూలు చేస్తామన్నారు.

* బాండ్ ఉల్లంఘనకు సంబంధించి చట్టప్రకారం తదుపరి విచారణ చేపట్టి, అవసరమైన సందర్భాల్లో సంబంధిత వ్యక్తులను నిర్బంధంలోకి తీసుకునే చర్యలు కూడా ఉంటాయన్నారు.

* బైండోవర్ చర్యలు తీసుకున్న వ్యక్తులు ఇతర నేరాలకు పాల్పడితే, ఆయా నేరాలకు సంబంధించిన ప్రత్యేక కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.

* ఓటర్లను బెదిరించడం, ఓటు వేయకుండా అడ్డుకోవడం, ప్రలోభాలకు గురిచేయడం, పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు సృష్టించడం, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని జిల్లా ఎస్పీ  శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ గారు హెచ్చరించారు.

ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవిస్తూ సంయమనంతో వ్యవహరించాలని, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా సహకరించాలని ప్రజలను జిల్లా ఎస్పీ శ్రీ ఎఆర్ దామోదర్ కోరారు.
Breaking News

Subscribe our Newsletter