ప్రకృతి సాగుతో వరిలో ఆశాజనక దిగుబడి..

ప్రకృతి సాగుతో వరిలో ఆశాజనక దిగుబడి..

19/November/2026 20:31    Share:   

పంటకోత ప్రయోగంలో ఎకరానికి సుమారు 27 బస్తాల దిగుబడి అంచనా
*మద్ది (పద్మనాభం), నవంబర్ :*

రసాయన ఎరువులకు దూరంగా, ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సాగు చేస్తున్న వరి పంటలో ఆశాజనకమైన దిగుబడి నమోదైంది. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామంలో రైతు నల్లి అప్పలనాయుడు సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ వరి పంటలో గురువారం పంటకోత ప్రయోగం (క్రాప్ కటింగ్ ఎక్స్‌పెరిమెంట్) నిర్వహించారు.

రైతు సాధికార సంస్థ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బుస్సాల శ్యామల ఆదేశాల మేరకు, గ్రామ వ్యవసాయ సహాయకుడు అప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రయోగంలో నేచురల్ ఫార్మింగ్ అసోసియేట్ బాలమణి, కమ్యూనికేషన్ థీమాటిక్ ఉష, మాస్టర్ ట్రైనీ సాగర్, ఫీల్డ్ మాస్టర్ ట్రైనీ దుర్గారావు, ఐసీఆర్‌పీ రావణమ్మ పాల్గొన్నారు.

గత రెండు సంవత్సరాలుగా పీఎండీఎస్ (PMDS) విధానంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు నల్లి అప్పలనాయుడు తన పొలంలో మైసూర్ మల్లిక రకం వరిని సాగు చేశారు. పంట దిగుబడిని శాస్త్రీయంగా అంచనా వేయడానికి 5 × 5 మీటర్ల విస్తీర్ణంలో పంటను కోసి తూకం వేయగా 14 కిలోల ధాన్యం దిగుబడి వచ్చింది. ఈ లెక్కల ప్రకారం ఎకరానికి సుమారు 27 బస్తాల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసిన పంట దిగుబడిని, సంప్రదాయ రసాయన వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసిన పంట దిగుబడితో పోల్చి రెండు విధానాల మధ్య వ్యత్యాసాన్ని శాస్త్రీయంగా అంచనా వేయడమే పంటకోత ప్రయోగాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడి సాధించే అవకాశం ఉండటంపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రైతులకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి దోహదపడతాయని వ్యవసాయ సిబ్బంది పేర్కొన్నారు.
Breaking News

Subscribe our Newsletter