పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే మా లక్ష్యం
17/November/2026 20:10
Share:
- విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి
యలమంచిలి : రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన యలమంచిలి సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి, రికార్డులను పరిశీలించారు. అనంతరం స్థానిక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై పలు ప్రణాళికాబద్ధమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐజీ మాట్లాడుతూ.. గతంలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను అత్యంత ప్రశాంతంగా ముగించామని, అదే స్ఫూర్తితో జరగబోయే మూడు విడతల పంచాయతీ ఎన్నికలను కూడా ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక భద్రతా వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలోనూ ఒక డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా చిన్నపాటి సంఘటన జరిగినా ఈ బృందాలు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకునేలా పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి, ఆ ప్రాంతాల్లోని అనుమానితులు, ట్రబుల్ మేకర్స్‌కు ఇప్పటికే పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. కొందరిపై ఇప్పటికే బైండోవర్ కేసులు నమోదు చేశామని, చట్టాన్ని అతిక్రమించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తే ఎంతటివారైనా సరే కఠిన చర్యలు తప్పవని ఐజీ హెచ్చరించారు. శాంతియుత ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు, ప్రజలందరూ సహకరించాలని, ప్రతి ఒక్కరూ తమ ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, డీఎస్పీ మోహన్ రావు, సర్కిల్ సీఐ ధనంజయరావు, రూరల్ ఎస్ఐ ఉపేంద్ర, టౌన్ ఎస్ఐ సావిత్రి, ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు