పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాల్లో ఎస్పీ తనిఖీలు..

పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాల్లో ఎస్పీ తనిఖీలు..

16/November/2026 22:34    Share:   

నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు!
అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు.. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

అనకాపల్లి, నవంబర్ 16:
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదివారం మొదటి విడత రెండో రోజు నామినేషన్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తూరు, అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేబాక గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు.
నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థితో పాటు మద్దతుగా మరో ఇద్దరికి మాత్రమే అనుమతి కల్పిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేస్తున్నారు.వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ఒకేసారి కేంద్రాలకు చేరుకోకుండా వేర్వేరు సమయాలను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ప్రజలు, కార్యకర్తలు గుమిగూడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ వేగవంతంగా జరిగేలా రిటర్నింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అభ్యర్థులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
Breaking News

Subscribe our Newsletter