
న్యూఢిల్లీ:
దేశ రాజధాని ఢిల్లీతో సహా పలు నగరాల్లో వాయు కాలుష్య స్థాయిలు ప్రమాదకరంగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం GRAP (గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్) చర్యలను కఠినతరం చేసింది.
వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) శుక్రవారం ఢిల్లీ-NCR పరిధిలో GRAP-3వ దశ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉదయం ఢిల్లీ మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 391గా నమోదైంది. ఇది 'తీవ్ర' కేటగిరీకి చేరువగా ఉంది. నగరంలోని 59 పర్యవేక్షణ కేంద్రాల్లో 30 చోట్ల ఉదయం 9 గంటలకే 'తీవ్ర' స్థాయి కాలుష్యం నమోదుకాగా, మిగిలిన చోట్ల 'అత్యంత అధ్వాన్న' స్థాయిలో నమోదైంది. దట్టమైన పొగమంచు, విషపూరిత పొగ నగరాన్ని కమ్మేసింది.
గత ఏడాది నవంబర్ నెలలో కాలుష్యం తీవ్ర, అతి తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో, స్థానిక ఉద్గారాలు, పంట వ్యర్థాల దహనం, తక్కువ గాలి వేగం, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ ముందస్తు చర్యలు తీసుకున్నట్లు CAQM తెలిపింది.
ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని, మాస్కులు ధరించాలని, వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు