అనకాపల్లి:
దసరా సెలవుల అనంతరం ఈ నెల 22 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల హాజరు శాతం తగ్గకుండా ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) నాగేశ్వరరావు ఆదేశించారు. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా అధికారులకు, ఉపాధ్యాయులకు ఆయన పలు కీలక సూచనలు జారీ చేశారు.
పాఠశాల ఆవరణలు, తరగతి గదులను శుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని స్పష్టం చేశారు. అలాగే నాణ్యమైన విద్యాబోధనతో పాటు మధ్యాహ్న భోజన పథకం (ఎండీఎం) నాణ్యతా ప్రమాణాలతో సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు.
రెండో సెమిస్టర్‌కు సంబంధించిన పాఠ్యపుస్తకాలను మండల కేంద్రాల నుంచి వెంటనే పాఠశాలలకు చేరవేసి విద్యార్థులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది సైతం విధులకు విధిగా హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు.