స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు..

స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు..

18/October/2026 19:45    Share:   

స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు: అనకాపల్లి డీఎస్పీ శ్రీ పి.వి.వి.నరసింహారావు 
సభలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి | ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు 

అనకాపల్లి, అక్టోబర్ 18:

స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, పూర్తి ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా అనకాపల్లి సబ్-డివిజన్ పరిధిలో పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు తెలిపారు.

ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) నిబంధనల ప్రకారం ఈ నెల 14వ తేదీ నుంచే శాంతిభద్రతల పరిరక్షణ చర్యలు క్షేత్రస్థాయిలో అమల్లోకి వచ్చాయని ఆయన స్పష్టం చేశారు.

ఈ మేరకు ఆయన కీలక ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేశారు.

సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు

అనకాపల్లి డివిజన్ వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని డీఎస్పీ పేర్కొన్నారు. పోలీస్ శాఖ నుంచి ముందస్తు లిఖితపూర్వక అనుమతి లేకుండా బహిరంగ సభలు, సమావేశాలు, ఊరేగింపులు, బైక్ ర్యాలీలు నిర్వహించడం, మైక్ సెట్లు, లౌడ్ స్పీకర్లు వినియోగించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.

ఎన్నికల కోడ్ తప్పనిసరి

గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల నియమావళిని తు.చ. తప్పకుండా పాటించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై అనధికార ఫ్లెక్సీలు, బ్యానర్లు, గోడ రాతలను అనుమతించబోమని స్పష్టం చేశారు.

ప్రలోభాలపై ప్రత్యేక నిఘా

ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు, మద్యం, బహుమతులు లేదా ఇతర వస్తువులు పంపిణీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. అక్రమ రవాణా, నిల్వలపై FST, SST ప్రత్యేక నిఘా బృందాలు 24 గంటలూ తనిఖీలు నిర్వహిస్తాయని, నిబంధనలు అతిక్రమించిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసినా సహించబోమని డీఎస్పీ హెచ్చరించారు. రౌడీషీటర్లు, పాత నేరస్థుల కదలికలపై నిరంతర నిఘా ఉంచామని తెలిపారు.

ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రజలు, రాజకీయ పార్టీలు పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



​,
Breaking News

Subscribe our Newsletter