అనకాపల్లిలో గ్రామీణ తపాలా ఉద్యోగుల ధర్నా
గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి,8వ వేతన సంఘంలో చేర్చాలి.. సివిల్ సర్వెంట్ హోదా కల్పించాలి
అనకాపల్లి, అక్టోబర్ 15:
గ్రామీణ తపాలా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ (AIGDSU) నాయకులు డిమాండ్ చేశారు. యూనియన్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు గురువారం అనకాపల్లి డివిజనల్ తపాలా కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో 200 మందికి పైగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆధార్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ఏఈపీఎస్ తదితర సేవలను ప్రజలకు చేరవేయడంలో GDS ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అయితే, పెరుగుతున్న పని భారం, డిజిటల్ సేవలు, లక్ష్యాల ఒత్తిడికి అనుగుణంగా వేతనాలు, అలవెన్సులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.GDS ఉద్యోగులను 8వ కేంద్ర వేతన సంఘం పరిధిలోకి తీసుకురావాలని, సివిల్ సర్వెంట్ హోదా కల్పించాలని, పెన్షన్, గ్రాట్యుటీ, వైద్య సౌకర్యాలు అందించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతోపాటు పెరుగుతున్న రవాణా, ఇంటర్నెట్ ఖర్చులకు అనుగుణంగా అలవెన్సులు పెంచాలని కోరారు.ఈ ధర్నాకు NFPE గ్రూప్-C కార్యదర్శి హరీష్ కుమార్, పోస్ట్‌మెన్, MTS సంఘం అధ్యక్షుడు చిరంజీవి, కార్యదర్శి శ్యామ్ కుమార్ మద్దతు తెలిపారు. కార్యక్రమానికి AIGDSU అనకాపల్లి డివిజన్ కార్యదర్శి డి.ఎస్.ఆర్. ప్రసాద్ అధ్యక్షత వహించగా, డివిజన్ అధ్యక్షుడు ఆర్.వి. నాగరాజు, నర్సీపట్నం బ్రాంచ్ కార్యదర్శి లోవనాయుడు, చంద్రకుమార్, మొల్లి నాగేశ్వరరావు, దిలీప్, బద్రం తదితరులు పాల్గొన్నారు.