పట్టణంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రుల మొదటి రోజు సందర్భంగా పట్టణంలోని కనక మహాలక్ష్మి దేవాలయం, పెంజెరువు దుర్గాదేవి దేవాలయం, కాకివాని వీధి దుర్గా ఆలయం, టిడ్కో గృహ సముదాయం, గాయత్రి ఆధ్యాత్మిక జ్ఞానపీఠంతో పాటు పలు మండపాలలో ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ఆలయాలన్నీ విద్యుద్దీపాలు, పుష్పాలంకరణలతో ముస్తాబై ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వేకువజాము నుంచే అర్చకులు అమ్మవార్లకు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు, విశేష అర్చనలు, అలంకారాలు నిర్వహించారు. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్ద బారులు తీరారు. భక్తుల నామస్మరణలతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, తీర్థ ప్రసాద వితరణ ఏర్పాట్లు చేశారు. నవరాత్రుల ప్రారంభ వేడుకల్లో భాగంగా స్థానిక సెయింట్ జూడ్స్ పాఠశాలలో విద్యార్థినులకు సాంప్రదాయబద్ధంగా కన్యకా పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నపిల్లలను సాక్షాత్తు జగన్మాత స్వరూపాలుగా భావిస్తూ వారికి పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. భారతీయ సనాతన సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతను భావితరాలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రధానోపాధ్యాయులు రిక్కీ సర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రానున్న తొమ్మిది రోజుల పాటు పట్టణంలోని అన్ని ఆలయాల్లో అమ్మవారు వివిధ అవతారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.