జంఝావతి ప్రాజెక్టు సాధనకు ఐద్వా సంపూర్ణ మద్దతు..

జంఝావతి ప్రాజెక్టు సాధనకు ఐద్వా సంపూర్ణ మద్దతు..

10/October/2026 20:45    Share:   

19వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు.. ఉద్యమానికి అండగా నిలిచిన మహిళా సంఘం
ప్రాజెక్టు నిర్మాణం వెంటనే చేపట్టాలి: ఐద్వా జిల్లా నాయకులు

పార్వతీపురం, అక్టోబరు 10:

పార్వతీపురం మన్యం జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన జంఝావతి ప్రాజెక్టు సాధన కోసం సాగుతున్న ప్రజా ఉద్యమానికి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జంఝావతి ప్రాజెక్టు సాధన కమిటీ ఆధ్వర్యంలో పార్వతీపురంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం 19వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఐద్వా పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డి శ్రీదేవి, బొత్స లక్ష్మి ఆధ్వర్యంలో మహిళా సంఘం నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఐద్వా నాయకులు మాట్లాడుతూ.. పార్వతీపురం పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే జంఝావతి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సుమారు 75 గ్రామాల ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయలతో వివిధ ప్రాజెక్టులను నిర్మిస్తున్న ప్రభుత్వాలు.. అత్యంత వెనుకబడిన పార్వతీపురం మన్యం ప్రాంత అభివృద్ధికి దోహదపడే జంఝావతి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజల తాగునీటి అవసరాలు, రైతుల సాగునీటి కష్టాలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం తక్షణమే ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు..
Breaking News

Subscribe our Newsletter