చీపురుపల్లి, అక్టోబర్ 8:
పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు ప్రతి కుటుంబంలో పౌష్టికాహారంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని కిమిడి రామ్ మల్లిక్ నాయుడు అన్నారు. చీపురుపల్లి పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో నిర్వహించిన పోషణ మాసం–2026 కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన తల్లి ఉంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డ, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు. గర్భధారణ దశ నుంచే తల్లులకు సమతుల్యమైన పౌష్టికాహారం అందించడంతో తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చన్నారు. చిన్నారుల ఎదుగుదలలో తొలి దశ అత్యంత కీలకమని, ఈ సమయంలో పోషకాహారం, పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రాలు కేవలం పౌష్టికాహారం పంపిణీ చేసే కేంద్రాలు మాత్రమే కాకుండా.. చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదలతో పాటు తల్లులకు ఆరోగ్య, పోషకాహారంపై అవగాహన కల్పించే కేంద్రాలుగా పనిచేస్తున్నాయని తెలిపారు. అంగన్వాడీ, ఆశా, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పోషకాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించి తగిన సూచనలు, సేవలు అందించాలని సూచించారు.
గర్భిణులు, బాలింతలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని సమతుల్యంగా తీసుకోవాలని కోరారు. చిన్నారులకు వయసుకు తగిన పౌష్టికాహారం అందించడంతో పాటు పరిశుభ్రత, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, స్వచ్ఛమైన తాగునీటి వినియోగంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.