– ఇద్దరు నిందితుల అరెస్ట్ – రెండు స్నాచింగ్ కేసుల ఛేదన – 4.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం – గతంలో 36కు పైగా నేరాలకు పాల్పడిన పాత నేరస్థుడు – టౌన్ సీఐ ప్రేమ కుమార్ & సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్
అనకాపల్లి పట్టణం, అక్టోబర్ 6:
ఎస్ఐ ఎ.వెంకటేశ్వరరావు మరియు క్రైమ్ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పట్టణంలో సంచలనం సృష్టించిన చైన్ స్నాచింగ్ కేసులను విజయవంతంగా ఛేదించారు.
నిందితుల వివరాలు:
A-1: మహేందర్ సింగ్ @ మహేంద్ర (40 సం.), తండ్రి: ఖిమ్ సింగ్ చౌడా, స్వస్థలం: పంచవటి, నాగౌర్ జిల్లా, రాజస్థాన్; ప్రస్తుతం నివాసం: చంద్రంపాలెం, మధురవాడ, విశాఖపట్నం (వృత్తి: రాపిడో బైక్ రైడర్).
A-2: మండ్రు లత రత్నాకర్ (52 సం.), భర్త: రత్నాకర్, నివాసం: శ్రీ కృష్ణ గాయత్రి వైభవ నగర్, కొమ్మాది జంక్షన్, మధురవాడ, విశాఖపట్నం.
నేర చరిత్ర – నేరం జరిగిన తీరు:
పాత నేరస్థుడు: ప్రధాన నిందితుడు మహేందర్ సింగ్ 2007లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో హోంగార్డుగా పనిచేసి, అనంతరం జల్సాలు, మద్యానికి బానిసయ్యాడు. 2013-2015 మధ్య కాలంలో జీడిమెట్ల, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఒంటరి మహిళల మెడల నుంచి సుమారు 36 బంగారు గొలుసుల స్నాచింగ్ నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడు.
జైలు నుంచి విడుదలైన తర్వాత విశాఖపట్నం మధురవాడకు మకాం మార్చి, రాపిడో బైక్ నడుపుతూనే విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు తదితర ప్రాంతాలలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవాడు.
చోరీ చేసిన బంగారాన్ని A-2 మండ్రు లత రత్నాకర్‌కు ఇవ్వగా, ఆమె తనకు తెలిసిన నగల దుకాణాలలో విక్రయించి వచ్చిన సొమ్మును ఇద్దరూ పంచుకునేవారు.
అనకాపల్లిలో ఘటనలు: ఇదే ఏడాది మే 22న సాయంత్రం సమయంలో అనకాపల్లి బొడ్డేడువారి వీధిలో విశ్వనాథ నాగరత్నం అనే మహిళ వద్ద నుండి 1.5 తులాల బంగారు గొలుసును, అదే రోజు గాంధీనగర్‌లో పల్లా సత్యవతి అనే వృద్ధురాలి మెడ నుండి 3 పేటల బంగారు గొలుసును హెల్మెట్ ధరించి బైక్‌పై వచ్చి లాక్కెళ్లాడు.స్వాధీనం చేసుకున్న సొత్తు: విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మరియు అనకాపల్లి టౌన్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి నిందితులను కోర్టు అనుమతితో పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. నిందితురాలు A-2 మండ్రు లత రత్నాకర్ నుండి రెండు కేసులకు సంబంధించిన సుమారు 4.5 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసి, ఆమెను రిమాండ్‌కు తరలించారు.
పోలీస్ బృందానికి జిల్లా ఎస్పీ అభినందనలు:
కేసును చాకచక్యంగా ఛేదించి, సొత్తును రికవరీ చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన: అనకాపల్లి టౌన్ సీఐ జి.ప్రేమ కుమార్ స్ఐఎ.వెంకటేశ్వరరావు హెడ్ కానిస్టేబుల్: జి.గాంధీ కానిస్టేబుళ్లు: ఎం.సముద్రం, ఆర్.పి.నాయుడు, టి.ఎస్.నాయుడు లను జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.