స్వచ్ఛ వారియర్స్ సేవలకు జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవం
02/October/2026 18:46
Share:
ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం సేవలందిస్తున్న స్వచ్ఛత సిబ్బందికి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అభినందనలు
అనకాపల్లి, అక్టోబర్ 2:
అనకాపల్లి పెంటకోట కన్వెన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్రీ విజయ్ కృష్ణన్ నేతృత్వంలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026 జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, APUFIDC చైర్మన్ శ్రీ పీలా గోవింద సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, జోనల్ కమిషనర్ చక్రవర్తి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులు, స్వచ్ఛత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛత కోసం అంకితభావంతో సేవలందిస్తున్న 67 మంది స్వచ్ఛ వారియర్స్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దేశ సరిహద్దులను సైనికులు కాపాడుతున్నట్లే ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం స్వచ్ఛ వారియర్స్ సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన వికసిత భారత్–2047 లక్ష్యానికి అనుగుణంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పంతో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్–స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని పరిశుభ్రత, సేవాభావంతో ముందుకు సాగాలని కోరారు. స్వచ్ఛత, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణలో విశేష కృషి చేసిన వారికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అవార్డులను ప్రదానం చేశారు.