అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీలో రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా యలమంచిలిలోని పార్టీ కార్యాలయంలో మాజీ ప్రభుత్వ విప్, యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అధ్యక్షతన మున్సిపల్ ఎన్నికల ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల కార్యాచరణపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, నియోజకవర్గ పరిశీలకుడు కోలా గురువులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయాలు సాధించేలా పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ విధానాలపై పార్టీ తరఫున ప్రజల్లో విస్తృతంగా చర్చ చేపట్టాలని సూచించారు. యలమంచిలి మున్సిపాలిటీలో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
మున్సిపాలిటీలోని వివిధ వార్డుల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావహ అభ్యర్థులతో నాయకులు చర్చించారు. వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తూ, ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్‌ఈసీ సభ్యుడు బోదేపు గోవింద్, యలమంచిలి టౌన్ పార్టీ అధ్యక్షుడు బెజవాడ నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు త్రినాథ్, వార్డు అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.