ఏటికొప్పాక గ్రామం,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9, 10 తరగతుల ఒకేషనల్ ఎలక్ట్రానిక్స్ విద్యార్థులు సూర్య ప్రైవేట్ ఐటీఐని విద్యా పర్యటనలో భాగంగా సందర్శించారు. పాఠశాల హెచ్‌ఎం ఎం. రమణ పర్యవేక్షణలో ఒకేషనల్ ఉపాధ్యాయులు కుమార్ (ఎలక్ట్రానిక్స్), మనోజ్ ఆధ్వర్యంలో ఈ పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఐటీఐలోని ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ల్యాబ్‌లను సందర్శించి వివిధ రకాల సర్క్యూట్లు, టెస్టింగ్ పరికరాలు, యంత్రాల పనితీరును ఆసక్తిగా పరిశీలించారు. ఐటీఐ అధ్యాపకులు పరికరాల వినియోగం, సాంకేతిక అంశాలను విద్యార్థులకు వివరించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రస్తుతం ఉన్న మార్కెట్ డిమాండ్, భవిష్యత్ ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. తరగతి గది బోధనతో పాటు ప్రాక్టికల్ విజ్ఞానం, పారిశ్రామిక నైపుణ్యాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు ఈ పర్యటన దోహదపడిందని హెచ్‌ఎం రమణ తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పలు సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు వారికి అవసరమైన సూచనలు అందించారు.