కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు
.. ఎంపీ లాడ్స్ పనులు వేగవంతం చేయండి.
.. బీసీ హాస్టల్ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు తయారు చేయండి.
.. సమీక్షా సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
ఏలూరు, సెప్టెంబర్ 05: ఎంపీ లాడ్స్ నిధులతో చేపట్టిన పనులు, వాటి పురోగతిపై శనివారం ఏలూరు ఎంపీ కార్యాలయంలో అధికారులతో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గత రెండేళ్లలో మంజూరు చేసిన పనులలో కొన్ని ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై ఈ సందర్భంగా ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ లాడ్స్ నిధులపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నోట్ ను ప్రస్తావించిన ఎంపీ, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల నుంచి వచ్చే విజ్ఞప్తుల మేరకు తాను ఎప్పటికప్పుడు నిధులు కేటాయిస్తూ అనుమతులు ఇస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ డేటాలో తక్కువగా చూపిస్తున్న విషయం పై ఆరా తీశారు. పనులు పూర్తిచేసినప్పటికీ కొన్ని పనులను ఆన్లైన్ లో సబ్మిట్ చేయకపోవడం వల్ల డేటాలో తక్కువగా చూపిస్తోందని అధికారులు ఎంపీకి వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో అనుమతులు ఇచ్చిన ఆర్వో వాటర్ ప్లాంట్స్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా దెందులూరు అప్పన్న వీడు లో ప్రతిపాదించిన మల్టీపర్పస్ హాల్, వాషర్ మెన్ హాల్, ద్వారకాతిరుమల మల్టీపర్పస్ హాల్, టీ నర్సాపురం ఎస్సీ మల్టీపర్పస్ హాల్ పనుల పురోగతిపై ఎంపీ ప్రశ్నించగా, ఈ ఏడాది డిసెంబర్ నాటికి వీటి పనులు పూర్తవుతాయని అధికారులు సమాధానం ఇచ్చారు. ఏలూరు నగరంలోని శిథిలావస్థకు చేరిన లైబ్రరీ బిల్డింగ్ స్థానంలో కొత్తగా బిల్డింగ్ నిర్మాణం, ఇతర సదుపాయాలు కల్పన కోసం ప్రతిపాదన తయారు చేయాలని, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ హాస్టల్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు తయారు చేసి ఇస్తే వాటికి కేటాయింపులు చేస్తానని ఎంపీ చెప్పారు. నిధులు సరిపోకపోతే అవసరమైతే రాజ్యసభ సభ్యుల నుంచి కొన్ని నిధులను, సిఎస్ఆర్ నిధులను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని, అయితే మంజూరు చేసిన ఏడాదిలోపు పనులు పూర్తిచేసేందుకు విధిగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎంపీ ఆదేశించారు.