శిథిలావస్థలో చింతలపూడి అంబేద్కర్ గురుకుల పాఠశాల!

శిథిలావస్థలో చింతలపూడి అంబేద్కర్ గురుకుల పాఠశాల!

28/August/2026 21:50    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.
అధికారుల ఉదాసీనతకు నిలువెత్తు సాక్ష్యం: శిథిలావస్థలో చింతలపూడి అంబేద్కర్ గురుకుల పాఠశాల!
పాలకులు మారుతున్నా మారని విద్యార్థుల తలరాత.. 
​చింతలపూడి ఏలూరు జిల్లా
పేద, వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య, వసతి అందిస్తున్నామని ప్రభుత్వం ఊదరగొడుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలోని భయానక పరిస్థితులకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. ఏలూరు జిల్లా చింతలపూడిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల అధికారుల నిర్లక్ష్యానికి, ప్రజాప్రతినిధుల అలసత్వానికి సజీవ సాక్ష్యంగా మారింది. కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు నిత్యం నరకం చూస్తున్నా, సంబంధిత శాఖాధికారులు కనీసం "కన్నెత్తి చూడేపాపాన" పోకపోవడం తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది.
​ఒకే గదిలో చదువు.. నిద్ర.. భోజనం!
​పాఠశాల నిర్వహణ తీరు చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. విద్యార్థులు చదువుకోవడానికి ఒక గది, పడుకోవడానికి హాస్టల్, తిండి తినడానికి డైనింగ్ హాల్ అంటూ వేర్వేరుగా లేవు. ఆ శిథిలావస్థకు చేరిన భవనంలోనే తరగతి గది, అదే భవనంలో హాస్టల్ గది, అదే స్థలంలో డైనింగ్ హాల్! ఎప్పుడు ఏ కప్పు విరిగి నెత్తిపై పడుతుందో తెలియక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు.
​చుక్క నీరు కావాలంటే పక్క ఊరే గతి!
​అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటంటే.. ఈ పాఠశాలలో తాగడానికి, నిత్య అవసరాలకు కనీసం నీటి సౌకర్యం కూడా లేదు. పక్కనే ఉన్న ఆంతోని నగర్ గ్రామంలో ఉన్న ఒకే ఒక్క బోరుపై ఈ గురుకుల పాఠశాల ఆధారపడాల్సి వస్తోంది. పొరపాటున ఆ బోరు మోటార్ పాడైందో లేదా కరెంట్ పోయిందో.. ఆ రోజు విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం! చుక్క నీటి కోసం పసిపిల్లలు అల్లాడిపోతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎంతవరకు న్యాయం?
​లక్షల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరేనా?
​పాఠశాల పక్కనే లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనం ఒకటి అందుబాటులో ఉంది. అయితే, అధికారుల నిర్లక్ష్యం వల్ల దానిని సక్రమంగా వినియోగంలోకి తేకపోవడంతో, ఆ భవనం కూడా ప్రారంభానికి నోచుకోకుండానే శిథిలావస్థకు చేరుకుంటోంది. కట్టిన భవనాలను వాడకుండా పాడుబెడుతూ, పిల్లలను పాత భవనంలో నరకానికి గురిచేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి?
​విద్యాశాఖ, సంక్షేమ శాఖ అధికారులకు కళ్లు తెరవవా?
​"మా పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలి?" అని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.
​వెంటనే నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి.
​పక్కనే ఉన్న హాస్టల్ భవనాన్ని తక్షణమే పునర్నిర్మించి.మరమ్మత్తులు చేసి వినియోగంలోకి తేవాలి.
​శిథిలావస్థలో ఉన్న పాత భవనం నుంచి విద్యార్థులకు రక్షణ కల్పించాలి.
​ఇప్పటికైనా సంబంధిత జిల్లా కలెక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చింతలపూడి అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించి సమస్యలను పరిష్కరించకపోతే, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు.
Breaking News

Subscribe our Newsletter