రూ.3 కోట్లతో ఏటికొప్పాక హస్తకళ ఇతివృత్త ఉద్యానవనానికి భూమిపూజ..!!

రూ.3 కోట్లతో ఏటికొప్పాక హస్తకళ ఇతివృత్త ఉద్యానవనానికి భూమిపూజ..!!

28/August/2026 21:42    Share:   

క్రైమ్ అనాల్సిస్ | ప్రత్యేక ప్రతినిధి - టివియస్ ప్రకాష్ :

ఏటికొప్పాక హస్తకళలకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువస్తాం: ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్...!!!
 
అనకాపల్లి జిల్లా, యలమంచిలి మండలం, ఏటికొప్పాక లో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఏటికొప్పాక హస్తకళ ఇతివృత్త ఉద్యానవనానికి శుక్రవారం ఘనంగా భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది.
ఈ సందర్భంగా అధికారులు, ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ఏటికొప్పాక హస్తకళాకారుల పనితీరును పరిశీలించారు. కళాకారులు తయారు చేస్తున్న లక్క బొమ్మలు, సహజ రంగుల వినియోగం, సంప్రదాయ హస్తకళా విధానాలను ఆసక్తిగా పరిశీలించి, వాటి తయారీ విధానం గురించి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ, ఏటికొప్పాక హస్తకళలకు ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఏటికొప్పాక లక్క బొమ్మలకు పద్మశ్రీ, జాతీయస్థాయి అవార్డులు రావడం గ్రామానికి, హస్తకళాకారులకు గర్వకారణమని తెలిపారు. ప్రకృతి సిద్ధమైన రంగులను ఉపయోగించడం ఏటికొప్పాక కళాకారుల ప్రత్యేకత అని పేర్కొన్నారు.
ఈ ఉద్యానవన నిర్మాణానికి సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఏటికొప్పాక గ్రామానికి, హస్తకళాకారులకు పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చే గొప్ప అవకాశాన్ని కల్పించారని అన్నారు.
ఏటికొప్పాకలో సుమారు 10 ఎకరాల స్థలాన్ని గుర్తించి, హస్తకళా హబ్, థీమ్ పార్క్ అభివృద్ధికి ఈరోజు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో హస్తకళాకారుల సంక్షేమం, ఆరోగ్యం, జీవనోపాధి, ఉత్పత్తుల మార్కెటింగ్, పర్యాటక అభివృద్ధి వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తామని తెలిపారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో హస్తకళల ప్రదర్శన ఏర్పాటుకు కూడా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏటికొప్పాక లక్క బొమ్మలకు మరింత మార్కెట్ కల్పించి, ప్రపంచవ్యాప్తంగా వాటి ప్రాచుర్యాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఏటికొప్పాకలో హస్తకళా హబ్, థీమ్ పార్క్ అభివృద్ధితో పాటు సమీప ప్రాంతంలో రిసార్ట్ ఏర్పాటు, లెఫ్ట్ కెనాల్‌కు అనుమతులు తీసుకుని బోటు షికారు వంటి పర్యాటక సదుపాయాలను కూడా అభివృద్ధి చేయడానికి సంబంధిత శాఖలతో చర్చిస్తున్నామని తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏటికొప్పాక లక్క బొమ్మలు, హస్తకళల అభివృద్ధిపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారని, ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏటికొప్పాక హస్తకళాకారులకు మంచి రోజులు రాబోతున్నాయని ఎమ్మెల్యే అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటికొప్పాక లక్క బొమ్మలకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్న ఎమ్మెల్యే, ఏటికొప్పాకను భవిష్యత్తులో ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా, హస్తకళా హబ్‌గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
బండమ్మతల్లి ఆశీస్సులతో ఏటికొప్పాక గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి, హస్తకళాకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, టివియస్ ప్రకాష్, మరియు గ్రామ ప్రజలు, యువకులు, కూటమి నాయకులు, హస్తకళాకారులు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter