ఎలమంచిలి : (క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్)
యలమంచిలి నియోజకవర్గం పరిధిలోని ఏటికొప్పాక గ్రామంలో హస్తకళాకారుల కోసం ఏర్పాటు చేయనున్న హస్తకళాకారుల హబ్ పార్కు స్థలాన్ని మంగళవారం యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎమ్మార్వోతో పాటు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏటికొప్పాక కళాకారులకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. సంప్రదాయ హస్తకళలను పరిరక్షించడంతో పాటు కళాకారులకు మెరుగైన వసతులు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు హస్తకళాకారుల హబ్ పార్కు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
హస్తకళాకారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పార్కు నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేసి, అవసరమైన మౌలిక వసతులు కల్పించేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఏటికొప్పాక కళకు మరింత ప్రాచుర్యం కల్పించడంతో పాటు స్థానిక కళాకారులకు ఉపాధి, ఆదాయ అవకాశాలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, హస్తకళాకారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.