దళారుల దోపిడీ నుండి ఆయిల్ పామ్ రైతులను కాపాడండి..

దళారుల దోపిడీ నుండి ఆయిల్ పామ్ రైతులను కాపాడండి..

22/August/2026 19:11    Share:   

#కంపెనీలు,దళారుల మోసాలు, దోపిడీ నుండి ఆయిల్ పామ్ రైతులను కాపాడండి.
#కాటాలు వద్ద ఆయిల్ పామ్ గెలలు ఏరివేత ఆపాలి.
#ఆయిల్ పామ్ ఫ్రూట్ పై దళారులు నీళ్లు కొట్టడాన్ని నిరోధించాలి. 
#తుకాల్లో మోసాలు అరికట్టాలి.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు డిమాండ్..
 
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు

చెమటోడ్చి పండించిన ఆయిల్ పామ్ రైతులను దళారీ వ్యవస్థ నిలువునా ముంచేస్తోందని,ఏలూరు జిల్లాలో కొన్ని వే-బ్రిడ్జ్ కాటాల వద్ద నవభారత్,గోద్రెజ్ ఫ్యాక్టరీకి వెళ్లే ఆయిల్ పామ్ గెలల విషయంలో దళారులు సాగిస్తున్న ఆగడాలు పరాకాష్టకు చేరాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 
 శనివారం ఏలూరు అన్నే భవనంలో ఆయిల్ పామ్ రైతుల సమస్యలపై వారు మాట్లాడారు.
పగటిపూట రైతుల వద్ద సేకరించిన ఫ్రూట్‌ను కాటాల వద్ద పోసి, రాత్రికి రాత్రే దానిపై విచ్చలవిడిగా నీళ్లు కొడుతూ (వాటరింగ్) బరువు పెంచుతున్నారని,ఆ తర్వాతే ఆ లోడును ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారని చెప్పారు. గెలల్లో నీటి శాతం ఎక్కువగా ఉందనే సాకుతో ఫ్యాక్టరీ యాజమాన్యం ఆయిల్ పామ్ గెలల ధరను తగ్గించి వేస్తున్నాయని చెప్పారు.  దళారులు నీళ్లు కొట్టి దండుకున్న లాభాలకు,ఆయిల్ పామ్ రైతులు బలైపోతున్నారన్నారు . ఈ దళారుల దగా కారణంగా గత నెలలోనే టన్నుకు రూ. 450 చొప్పున ధర తగ్గి రైతులు నష్టపోయారని చెప్పారు. కష్టపడి పంట పండించిన రైతుకు నష్టం మిగులుతుంటే, మధ్యలో ఏమీ చేయని దళారులు మాత్రం జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. రైతుల శ్రమను దోచుకుంటున్న వే-బ్రిడ్జ్ కాటాల నిర్వాహకులు, దళారులపై ఉద్యాన,తూనికలు, కొలతలు శాఖల అధికారులు,జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాటాల వద్ద అక్రమంగా నీళ్లు కొట్టే విధానానికి స్వస్తి పలికేలా నిరంతరం తనిఖీలు చేపట్టాలన్నారు.దళారుల మోసాల వల్ల రైతులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసి, ఆయిల్ పామ్ రైతుకు ప్రభుత్వం నిర్ణయించిన ధర అందేలా చర్యలు చేపట్టాలన్నారు. పచ్చి గెలలు పేరుతో ఆయిల్ పామ్ ఫ్రూట్ ఏరివేత ఆపాలని కోరారు. పెదవేగి ఆయిల్ ఫెడ్ నూతన కర్మాగారం నిర్మాణానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని తద్వారా ఓ.ఈ.ఆర్ సమస్యను పరిష్కరించాలన్నారు. ఆయిల్ పామ్ రైతుల సమస్యలపై భవిష్యత్తులో ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని అందుకు రైతాంగం సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
Breaking News

Subscribe our Newsletter