వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఘనంగా కిసాన్ మేళా..!!

వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఘనంగా కిసాన్ మేళా..!!

20/August/2026 20:19    Share:   

క్రైమ్ అనాల్సిస్ |  టివియస్ ప్రకాష్ :
యలమంచిలి మండలం యలమంచిలి గ్రామంలో రాపేటి శ్రీను వారి కల్లాల వద్ద రైతులకు అవగాహన కల్పించేందుకు ఆత్మ వారి సౌజన్యంతో కిసాన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన అభ్యుదయ రైతులు, రైతు సేవా సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా రిసోర్స్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి పంటకు ప్రత్యామ్నాయంగా రాగులు, కందులు, జనుము, ఉలవలు వంటి తక్కువ నీటి అవసరమున్న పంటలను సాగు చేయాలని సూచించారు. తక్కువ కాల వ్యవధిలో పండే ఈ పంటల ద్వారా నేల సంరక్షణతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధ్యమవుతుందన్నారు.
ఏడీఏ శ్రీధర్ మాట్లాడుతూ, రైతులు తమ అవసరాలు, స్థానిక పరిస్థితులు, వ్యవసాయ శాఖ మరియు శాస్త్రవేత్తల సూచనలను అనుసరించి అనువైన పంటలను ఎంపిక చేసుకుని సాగు చేయాలని తెలిపారు.
పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు కె. రవిబాబు, బండి నాగేంద్ర మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున వరితో పాటు ఇతర చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. తద్వారా రైతుల ఆదాయంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
వ్యవసాయ సహాయ సంచాలకులు సుమంత మాట్లాడుతూ, వరి సాగు చేస్తున్న రైతులు వెంటనే ఫసల్ బీమా యోజన కింద పంట బీమా నమోదు చేసుకోవాలని సూచించారు. నీటిపారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో వరి సాగు చేస్తున్న రైతులు వ్యవసాయ శాఖ, రైతు సేవా కేంద్రాల సిబ్బంది ద్వారా తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు.
మండల వ్యవసాయ అధికారి మోహన్‌రావు మాట్లాడుతూ, రైతుల అవసరాలకు అనుగుణంగా విత్తనాలను రైతు సేవా కేంద్రాల ద్వారా ఇండెంట్ పెట్టి సకాలంలో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు మోహన్‌రావు, శంకర్, గోవిందు, అభ్యుదయ రైతులు రాపేటి శ్రీనివాసరావు, తేటకవి వెంకట సూర్య ప్రకాష్,  ఆడారి రమణబాబు, మల్ల గణేష్, తోట గణేష్, బత్తిన్ రమేష్, సిద్దిల్లప్పారావు, వ్యవసాయ విస్తరణ అధికారులు దేముడు, నూకరాజు, రైతు సేవా కేంద్ర సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter