అప్పన్నపాలెం భూ సేకరణ సమస్యపై రైతులకు అండగా కరణం ధర్మశ్రీ..!

అప్పన్నపాలెం భూ సేకరణ సమస్యపై రైతులకు అండగా కరణం ధర్మశ్రీ..!

19/August/2026 20:09    Share:   

రైతుల సమస్యలు పరిష్కరించే వరకు అండగా ఉంటానని హామీ..!!
క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
రాంబిల్లి మండలం గొరపూడి రెవెన్యూ పరిధిలోని భూములను ఎస్‌ఈజెడ్‌ ఫేజ్–II కోసం భూ సేకరణ చేస్తున్న నేపథ్యంలో అప్పన్నపాలెం గ్రామంలో రైతులు, గ్రామస్థులతో ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూ సేకరణ, నష్టపరిహారం, పునరావాసం, జీవనోపాధి తదితర అంశాలపై గ్రామస్థులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
2018లో ప్రకటించిన భూ సేకరణ అవార్డును రైతులు 2025లో హైకోర్టులో సవాలు చేయగా, 25-06-2026న తీర్పు వెలువడిన నేపథ్యంలో అధికారులు గ్రామస్థులతో చర్చలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామస్థుల సమస్యలను ధర్మశ్రీ పూర్తిగా విని, న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
గ్రామస్థుల తరఫున సుమారు 15 మందితో కమిటీ ఏర్పాటు చేసి, కలెక్టర్, ఆర్డీవో, ఇన్‌చార్జ్ మంత్రి కొల్లు రవీంద్రలను కలిసి సమస్యలను వివరించి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, హోం మంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్‌లను కూడా గ్రామస్థులు స్వయంగా కలిసి తమ సమస్యలను వివరించాలని సూచించారు.“ఉన్న ఊరు కన్నతల్లిలాంటిది. ఆ ఊరిని, తమ నివాసాలను కోల్పోవాల్సి వస్తే ఆ బాధను మాటల్లో చెప్పలేం” అని ధర్మశ్రీ పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామానికి న్యాయం జరగడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
అధికారులతో చర్చల అనంతరం కూడా అనుకూల పరిష్కారం లభించకపోతే న్యాయపరమైన మార్గాన్ని ఆశ్రయించాలని సూచించారు. అవసరమైతే నిర్వాసితులతో కలిసి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సమస్యను వివరించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాంబిల్లి మండల పార్టీ అధ్యక్షుడు కిషోర్ రాజు, జడ్పీటీసీ నాగరాజు, మాజీ ఎంపీపీ తిరుపతిరావు, గొరపూడి పంచాయతీ సర్పంచ్ గణేష్, సీనియర్ నాయకులు నర్సింగరావు మాస్టారు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు
Breaking News

Subscribe our Newsletter