వరి నారు చివర్లు తొలగించాలి.. పంట బీమా చేసుకోవాలి..!!

వరి నారు చివర్లు తొలగించాలి.. పంట బీమా చేసుకోవాలి..!!

18/August/2026 19:54    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :

యలమంచిలి మండలం ఏటికొప్పాక, పద్మరాజుపేట గ్రామాల్లో మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి మోహన్‌రావు రైతులకు పలు సూచనలు చేశారు.
నీటిపారుదల, బోర్‌వెల్‌ సౌకర్యం ఉన్న ఏటికొప్పాక, పద్మరాజుపేట, రామారాయుడుపాలెం, తురంగలపాలెం తదితర గ్రామాల్లో వరి నాట్లు జరుగుతున్న నేపథ్యంలో రైతులు యాజమాన్య పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. దీనివల్ల పురుగులు, తెగుళ్ల ఉధృతిని తగ్గించవచ్చన్నారు.
వరి నారుమడులు పీకి నాటే సమయంలో నారు చివర్లను చిదిమేయడం వల్ల కాండం తొలిచే పురుగు ఉధృతి తగ్గుతుందని, తద్వారా తెల్లకంకి వచ్చే ప్రభావాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు పంట బీమా చేయించుకోవాలని సూచించారు. పంటల బీమా నమోదుకు గడువు ఈ నెలాఖరు వరకు పొడిగించినందున, ఇప్పటివరకు బీమా చేయించుకోని రైతులు వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు.
అలాగే ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించుకోవాలని తెలిపారు. దూర ప్రాంతాల్లో ఉన్న రైతులు వ్యవసాయ సిబ్బందిని సంప్రదించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని వివరించారు.
Breaking News

Subscribe our Newsletter