కొల్లేరు పరిరక్షణ నుంచి గ్రామీణ సమస్యల వరకు సమస్యల పరిష్కారమే లక్ష్యం..

కొల్లేరు పరిరక్షణ నుంచి గ్రామీణ సమస్యల వరకు సమస్యల పరిష్కారమే లక్ష్యం..

17/August/2026 19:44    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.
   
ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్, దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి ఘంటసాల వెంకటలక్ష్మి జిల్లా కలెక్టర్ ని కలిసి దెందులూరు నియోజకవర్గం, కొల్లేరు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు.
కొల్లేరు సరస్సు నీటి కాలుష్య నివారణ, పరిశ్రమల వ్యర్థజలాల నియంత్రణ, పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను కొల్లేరుకు మళ్లించే సాధ్యాసాధ్యాల పరిశీలన, రెగ్యులేటర్ నిర్మాణం, కొల్లేరు ప్రజల జీవనాధార పరిరక్షణ వంటి అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే కోమటిలంకకు శాశ్వత వంతెన, అధ్వానంగా ఉన్న రహదారి పునర్నిర్మాణం; శ్రీపర్రుకు శాశ్వత స్మశాన వాటిక; కొల్లేరు ప్రాంత విద్యార్థులకు ప్రత్యేక బస్సు; గుడివాకలంక–కొక్కిరాయిలంక మార్గంలోని నిరుపయోగ విద్యుత్ స్తంభాల తొలగింపు వంటి సమస్యలపై కూడా వినతిపత్రాలు సమర్పించారు.
దెందులూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ప్రభుత్వ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా తనకు సమాచారం, ఆహ్వానం అందేలా సంబంధిత MPDOలు, MROలు, ఇతర శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, వాటి అమలును పర్యవేక్షించాలని కోరారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినతిపత్రాల్లో పేర్కొన్న అంశాలను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని వెంకటలక్ష్మికి హామీ ఇచ్చారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రాధాన్యతతో పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రతి సోమవారం జరిగే పీజీఆర్‌ఎస్‌లో దెందులూరు నియోజకవర్గంలోని గ్రామాల ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం లభించే వరకు నిరంతరం కృషి చేస్తానని వెంకటలక్ష్మి తెలిపారు. ప్రజా సమస్యలపై అధికారులు బాధ్యతతో స్పందించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కారం చూపాలని కోరారు.
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేసి, కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందనే నమ్మకాన్ని మరింత బలపరచడంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.
Breaking News

Subscribe our Newsletter