విశాఖపట్నం : వినియోగదారుల రక్షణ చట్టం అమలు, వినియోగం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న కన్సూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ (సీఓఫ్)కు 80వ స్వాతంత్య్ర దినోత్సవ పురస్కారం దక్కింది. ఈ పురస్కారాన్ని శనివారం పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్య్రదినోత్సవం వేడుకల్లో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేతుల మీదుగా సీఓఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ ప్రశంసా పత్రం (అవార్డు) అందుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలక్టర్ ఎం.అభిషిక్ట్ కిషోర్, జాయింట్ కలక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్జి, జీవీఎంఎసీ కమిషనర్ కేతన్ గార్గ్ పాల్గొన్నారు. గడచిన 36 ఏళ్లుగా వినియోగదారుల రక్షణ చట్టం, 21 ఏళ్లుగా సమాచార హక్కు చట్టం అమలు, చట్టాలను ఎక్కువ సంఖ్యలో ప్రజలు వినియోగించుకునేందుకు వీలుగా అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం, ఉచితంగా దరఖాస్తులు పంపిణీ, పుస్తకాలు ప్రచురణల ద్వారా ఉద్యమ వ్యాప్తికి ఆయన తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటరమణ కన్సూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా, పబ్లిక్ ఫోరం రాష్ట్ర నమన్వయకర్తగా, వినియోగదారుల రక్షణ, ఆర్టీఐ చట్టాల రిసోర్స్‌పర్సన్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్, కన్సల్టెంట్, విశ్లేషకునిగా, రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాలు శాఖ రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యునిగా సేవలందిస్తున్నారు. కాగా ఇంతవరకు వినియోగదారుల హక్కుల రక్షణ చట్టంపై 29, ఆర్టీఐ చట్టంపై 12, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్‌పై 11, తూనికలు, కొలతల శాఖ సేవలపై రెండు ప్రత్యేక పుస్తకాలను రూపొందించారు. కాగా కాండ్రేగుల వెంకరమణకు అవార్డు దక్కడం పట్ల అధికారుల, ప్రజా సంఘాల ప్రతినిధులు వేర్వేరు ప్రకటనల్లో హర్షం ప్రకటించారు.