కాపు సమాజ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకగా నిలిచిన స్వర్గీయ ముద్రగడ పద్మనాభం మరణం సమాజానికి తీరని లోటని ఎలమంచిలి నియోజకవర్గ కాపు జేఏసీ కన్వీనర్ ద్వారపురెడ్డి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఉద్యమ నాయకుడిగానే కాకుండా వేలాది కుటుంబాలకు ఆత్మీయుడిగా ముద్రగడ నిలిచారని ఆయన అన్నారు. ముద్రగడతో తమ కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉందని నాగేశ్వరరావు తెలిపారు. తన తండ్రి స్వర్గీయ ద్వారపురెడ్డి అప్పారావు ఆహ్వానం మేరకు 2018లో ముద్రగడ గోకివాడ గ్రామంలోని తమ నివాసానికి వచ్చిన సందర్భంగా చుట్టుపక్కల సుమారు 20 గ్రామాల నుంచి అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చారని గుర్తుచేశారు. ప్రజల్లో ఆయనకు ఉన్న అపార ఆదరణకు అది నిదర్శనమని పేర్కొన్నారు. 1983 నుంచే కిర్లంపూడిలో జరిగిన కాపు ఉద్యమాల్లో తాను చురుకుగా పాల్గొన్నానని, వంగవీటి మోహనరంగాతో కలిసి విజయవాడలో నిర్వహించిన ఉద్యమ సమావేశాలకు హాజరైనట్లు తెలిపారు. అలాగే 1992లో కిర్లంపూడి నుంచి విశాఖపట్నం వెళ్తున్న ముద్రగడను ఎలమంచిలి పోలీస్ స్టేషన్‌లో నిలిపివేసిన సమయంలో తాను అక్కడికి వెళ్లి భోజనం అందించిన సంఘటనను భావోద్వేగంతో స్మరించుకున్నారు. ముద్రగడ వ్యక్తిత్వం, ఉద్యమ నిబద్ధత, కాపు సమాజం కోసం చేసిన త్యాగాలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని నాగేశ్వరరావు అన్నారు. ఆయన లేని లోటు ఎప్పటికీ భర్తీ కాదని, అయితే ఆయన చూపిన మార్గం సమాజాన్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం ఎలమంచిలి నియోజకవర్గ కాపు జేఏసీ ఆధ్వర్యంలో ముద్రగడ పద్మనాభంకు ఘనంగా నివాళులర్పించిన అనంతరం కిర్లంపూడికి వెళ్లి కడసారి నివాళులు అర్పించనున్నట్లు ద్వారపురెడ్డి నాగేశ్వరరావు తెలిపారు.