అనకాపల్లి జిల్లా,
(క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామం చివర కొండ ప్రాంతంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో సుమారు 170 ఇళ్ల స్థలాలు కేటాయించారు. కాలనీలో నివసిస్తున్న ప్రజలు కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ట్యాపులు ఉన్నా తాగునీరు అందడం లేదని, దీంతో మంచినీటి కోసం సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని తెలిపారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు లేక వర్షం పడితే ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.కాలనీ నుంచి ప్రధాన రహదారి వరకు వీధి దీపాలు లేక పొలాల మధ్యగా రాత్రివేళ రాకపోకలు సాగించడం కష్టంగా మారిందని తెలిపారు. ఉపాధి, ఉద్యోగాల కోసం కంపెనీలకు వెళ్లే వారు ప్రధాన రహదారి వద్ద బస్సులు, ఆటోల కోసం వేచి ఉండాల్సి వస్తోందని చెప్పారు.
అక్కడ బస్సు షెల్టర్ లేక ఎండైనా, వర్షమైనా నిలబడేందుకు కనీస వసతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.“మేమూ ఏటికొప్పాక గ్రామానికి చెందినవారమే.. మా సమస్యలను కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలి” అంటూ కాలనీ వాసులు కోరుతున్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, బస్సు షెల్టర్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.