క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని ఏటికొప్పాక సహకార చక్కెర ఫ్యాక్టరీకి చెందిన భూములు, ఆస్తులను విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సహకార చక్కెర కర్మాగారాల ఆస్తులు రైతుల శ్రమతో ఏర్పడినవని, వాటిని ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు విక్రయించకుండా కాపాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కర్మాగారాలు మూతపడటంతో చెరకు రైతులు,కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మూతపడిన సహకార చక్కెర ఫ్యాక్టరీలను పునరుద్ధరించేందుకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.సహకార సంఘాల ఆస్తులను అమ్మకుండా వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని, చెరకు రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, కార్మికులు, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే ఆస్తుల విక్రయ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, సహకార చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కిసాన్ కాంగ్రెస్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గుమ్మెళ్ల గోవింద రావు ఆధ్వర్యంలో రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.