
'టీచర్ల కష్టం, ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు'.. వైసీపీపై విరుచుకుపడిన జనసేన నేత
విజయవాడ: 2025 మెగా డీఎస్సీని పారదర్శకంగా, అక్రమాలకు తావు లేకుండా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పకడ్బందీగా నిర్వహిస్తున్నారని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేయడం సరికాదని, రేయింబవళ్లు కష్టపడి చదివి టీచర్ ఉద్యోగాలు పొందిన నిరుద్యోగ యువత కష్టాన్ని తక్కువ చేసి చూడొద్దని హితవు పలికారు.మెగా డీఎస్సీపై అభాండాలు వేయడం మానుకోవాలని, టీచర్ల కష్టాన్ని, వారి ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దని రెడ్డి అప్పలనాయుడు వైసీపీ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
చట్టవిరుద్ధ చర్యలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు
సోమవారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చట్టానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు, ఆందోళనలు చేసుకునే హక్కు అందరికీ ఉంటుందని, కానీ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే మాత్రం కూటమి ప్రభుత్వం ఉపేక్షించేది లేదన్నారు. మెగా డీఎస్సీపై గొడ్డలి పార్టీ వారు నిర్వహిస్తున్న నిరసనలు, దొంగ దీక్షలు శృతి తప్పుతున్నాయని విమర్శించారు.నోటిఫికేషన్ రాగానే, కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకోవాలని చూశారు. మంత్రి లోకేష్ బాబు ఆ అడ్డంకులన్నింటిని అధిగమించి, మెగా డీఎస్సీని అవినీతికి అక్రమాలకు తావు లేకుండా నిర్వహిస్తున్నారన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల కుటుంబాల్లో, కూటమి ప్రభుత్వం వెలుగులు నింపుతుంటే ఈ గొడ్డలి పార్టీ నాయకులు అవమానిస్తుందని రెడ్డి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న, లేకపోయినా టీచర్లను అవమానించడమే పనిగా పెట్టుకోవడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఐదేళ్ల పాలనలో ఉపాధ్యాయులను అన్ని విధాల జగన్ వేధించారని ఆయన మండిపడ్డారు. వైసిపి జగన్ రెడ్డి తప్పుడు ఆరోపణలపై రాయలసీమకు చెందిన ఉపాధ్యాయులంతా సమర శంఖం పూరించారన్నారు.. ఖబర్దార్ జగన్ రెడ్డి..?? వారిని ఇలాగే అవమానిస్తే తీవ్ర పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. మీడియా సమావేశంలో నగర అధ్యక్షులు వీరంకిపండు, గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశి నరేష్, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బెజవాడ నాగభూషణం కుమార్, పైడి లక్ష్మణరావు, బోండా రాము నాయుడు, జనసేన రవి, ములికి శ్రీనివాస్, వాసా సాయి తదితరులు పాల్గొన్నారు..