కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు
ఎన్నికల వాగ్దానాలు అమలు చేయని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి.
బద్లావ్ జరూరిహై-మార్పు కోసం అంటూ సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో పాండురంగ థియేటర్ వద్ద గల ఏలూరు మాజీ ఎమ్మెల్యే అత్తలూరి సర్వేశ్వరరావు విగ్రహం వద్ద నుండి పాదయాత్ర ప్రారంభించి కరపత్రాలను పంచిపెట్టారు.
ఈ పాదయాత్రలో పాల్గొన్న సీపీఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఈ దేశ యువతకు కల్పిస్తామని, రైతులకు మద్దతు ధర ఇస్తామని, ధరల పెరుగుదలను అరికడతామని అనేక వాగ్దానాలు ఇచ్చి 12 ఏళ్లు గడిచిన నేటికీ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. మతం పేరుతో విద్వేష రాజకీయాలు చేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై దేశద్రోహులుగా అర్బన్ నక్సల్స్ గా దాడి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తక్షణమే విడనాడి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలోని యువత విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. వరుస పేపర్ లీకేజీలు జరగడం వలన దేశంలోని విద్యార్థులు ఆందోళన చెంది బలవన్మమరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యురాలు కొల్లూరి సుధారాణి, గొర్లి స్వాతి, శాయన అభిలాష్ కుమార్ కౌన్సిల్ సభ్యులు కొండేటి రాంబాబు, సభ్యులు కొండేటి మేరి, ఉప్పులూరి లక్ష్మి,ఉప్పులూరి భవాని,మరడాని సత్యవతి,పంతం సుందరమ్మ, సిపిఐ సీనియర్ నాయకులు గొర్రెల లక్ష్మణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.