కృష్ణా డెల్టాకు సాగునీటి కోసం రోడ్డెక్కిన  అన్నదాతలు.

కృష్ణా డెల్టాకు సాగునీటి కోసం రోడ్డెక్కిన  అన్నదాతలు.

03/August/2026 18:56    Share:   

@ఏలూరు కలెక్టరేట్ ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో కృష్ణా డెల్టా రైతులు ధర్నా..
@ కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేయాలి.
@ప్రత్యామ్నాయ మార్గాలను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం, జల వనరుల శాఖ వైఖరి పట్ల రైతులు ఆగ్రహం.
@కృష్ణా డెల్టాను ఎడారిగా మార్చవద్దు.. 
@ప్రభుత్వ వైఖరి పట్ల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ విమర్శ..
@సాగు నీరు ఇవ్వకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం.
@కృష్ణా డెల్టా రైతులు హెచ్చరిక. 
@తాడిపూడి ఎత్తిపోతల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలి.
@*తాడిపూడి ఎత్తిపోతల రైతుల డిమాండ్..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు
కృష్ణా డెల్టాకు సాగునీటి కోసం కృష్ణా డెల్టా రైతులు రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో  ఏలూరు కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ లోపలికి వెళ్తే కేసులు పెడతామని పోలీసులు బెదిరించడంతో పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం భారీ గేడ్లు వద్ద బైఠాయించారు. రైతు సంఘం, రైతుల ప్రతినిధి బృందం పిజిఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ వెట్రిసిల్వికి  వినతిపత్రం అందజేసి సాగునీటి పై చర్చలు జరిపారు.
కృష్ణా డెల్టాను ఎడారిగా మార్చవద్దు.. సాగునీరు ఇవ్వాలి అంటూ పెద్ద ఎత్తున రైతులు నినాదాలు చేశారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సాగునీరు ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వాధినేతలు, జల వనరుల శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా దెందులూరు, ఏలూరు నియోజక వర్గాల పరిధిలోని పరిధిలో కృష్ణా డెల్టా ఆయకట్టుకు భూములకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గోదావరి జిలాలు అందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దారుణమని విమర్శించారు. ఏలూరు రూరల్ మండలంలోని 10 వేల ఎకరాలకు పొణంగి పుంత కాలువ ద్వారా గోదావరి జలాలు ఎందుకు అందించలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. గోదావరి మెయిన్ కెనాల్ ను ఆధునీకరించకుండా నిర్లక్ష్యం చేసి రైతులను బలి చేయడం తగదన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోందని, పులిచింతల వద్ద 30 టీఎంసీల నీరు నిల్వ ఉందని, పట్టిసీమ కాలువ ద్వారా ఇప్పటివరకు కృష్ణా బ్యారేజ్ కు పది టీఎంసీల నీరుకు పైగా తరలించారని చెప్పారు. గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయని, పంటలకు మాత్రం నీళ్లు ఇవ్వలేకపోతున్నారని ఇది ప్రభుత్వ వైఫల్యం అని తీవ్రంగా విమర్శించారు. జూన్ 15 నుండి కృష్ణా డెల్టాకు సాగునీరు ఇస్తామని చెప్పి, సబ్సిడీపై వరి విత్తనాలు సరఫరా చేసి ఇప్పుడు అర్ధాంతరంగా సూపర్ ఎల్ నినో ఉందనే పేరుతో వరి సాగు చేయొద్దని ముఖ్యమంత్రి చెప్పడం రాష్ట్ర ప్రభుత్వానికి తగిన వ్యవసాయ ప్రణాళిక లేకపోవడమేనని అన్నారు. కృష్ణా డెల్టాలో రైతులు వరి నారుమళ్లు  వేసుకున్నారని, కొన్నిచోట్ల నాట్లు కూడా వేశారని చెప్పారు. ఎకరాకు రూ.10 వేలు నుండి రూ.15 వేలు వరకు రైతులు పెట్టుబడి పెట్టారని, అత్యధిక మంది కౌలు రైతులేనని అన్నారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన తర్వాత వరి సాగు చేయవద్దని ప్రభుత్వం చెప్పడం వలన కృష్ణా డెల్టా రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా  మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం,నాగార్జునసాగర్ కు పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్న క్రమంలో పట్టిసీమ నీరును కృష్ణా డెల్టాకు మళ్లించి పంటల సాగుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.కృష్ణా డెల్టాలో ఖరీఫ్ లోనే వరి సాగు చేస్తున్నారని, రబీలో అపరాల పంటలు సాగు చేస్తారని కాబట్టి ఖరీఫ్ కు వరి సాగుకు మీరు ఇవ్వాల్సిందేనని అన్నారు. ఏలూరు రూరల్ మండలం కృష్ణా ఆయకట్టుకు పోణంగి పుంత కాలువ ద్వారా గోదావరి జలాలు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు. తాడిపూడి ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు ఇవ్వకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
 కృష్ణా డెల్టా ఆయకట్టు రైతులు వాడవల్లి రామారావు, దాసరి హనుమంతరావు, బైరెడ్డి లక్ష్మణరావు మాట్లాడుతూ మాకు నీరు ఇవ్వకపోతే ఉపాధి లేక వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పశు పోషణ కూడా భారంగా మారుతుందని చెప్పారు. కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేసి పేద రైతులు,కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తాడిపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులు మలకలపల్లి నాగు, దాసరి సతీష్ మాట్లాడుతూ తాడిపూడి ఎత్తిపోతలకు సాగునీరు విడుదల చేసినా శివారు ప్రాంత భూములు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతున్నాయని సాగునీరు ఇచ్చి పంటలను కాపాడాలని కోరారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్. లింగరాజు మాట్లాడుతూ సాగునీటి కోసం రైతులు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం స్పందించి కృష్ణా డెల్టా రైతులను ఆదుకోవాలని కోరారు.
జిల్లా కలెక్టర్ వినత పత్రం..
సాగునీటికి ఇచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు, రైతులు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి వినతిపత్రం అందజేశారు. సాగునీటి సమస్యలను వివరించారు. తగు చర్యలు చేపడతామని ఆమె హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం రాంబాబు, కృష్ణా డెల్టా ఆయకట్టు రైతులు పైడిపాటి భాస్కరరావు, తలారి జయరాజు, దాసరి నాగేశ్వరరావు, బండి శ్రీనివాసరావు, కోన శ్రీనివాసరావు, పుట్టి దుర్గాప్రసాద్, మారుమూడి సుధాకర్, ఎస్.బాబు, ఎలికే ఏసు పాదం, నూలు ధర్మరాజు,శలాకోటి సుబ్బారావు, సత్తెనపల్లి నరసింహారావు,  చిన్ని పోతురాజు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు, దెందులూరు,పెదపాడు, ఉంగుటూరు,ద్వారకాతిరుమల మండలాలు నుండి రైతులు తరలివచ్చారు.
Breaking News

Subscribe our Newsletter