ఏలూరు, (కొండల ప్రసాద్, CA న్యూస్):
ఆదర్శవంతమైన సేవల నిర్వహణే ధ్యేయంగా, ప్రజోపయోగకర నిర్ణయాల అమలు లక్ష్యంగా సరికొత్త పంథాతో ముందుకెళ్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో భాగంగా ప్రతి గురువారం స్థానిక పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరం ఈ వారం కూడా విజయవంతంగా కొనసాగింది.
ప్రజల ఆరోగ్యానికి భరోసా
ఈ వైద్య శిబిరంలో ఏలూరు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు. శిబిరంలో భాగంగా అవసరార్థులకు వైద్యులు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. స్వయంగా శిబిరాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి చంటి, ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు దిశానిర్దేశం చేశారు. పలువురు రోగులకు స్వయంగా మందులను అందజేసి వారిలో ధైర్యాన్ని నింపారు.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సేవలు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, సాధ్యమైనంత రీతిలో సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నాం. నాణ్యమైన విద్య, వైద్యం అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలనేదే మా లక్ష్యం. ఈ సేవా కార్యక్రమాల్లో దాతలు అందిస్తున్న సహకారం ఎంతో అభినందనీయం" అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఈడా (EADA) చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, సీనియర్ నాయకులు బెల్లపుకొండ కిషోర్, లంకపల్లి మాణిక్యాలరావు, పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు.