పేదల కళ్ళల్లో సంతోషాల కాంతులు నింపడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో 50వ డివిజన్‌లో నెలకొన్న అంతర్గత రోడ్లు, డ్రైన్ల సమస్యల పరిష్కారానికి ప్రధమ ప్రాధాన్యతనిస్తామంటూ ఆయన భరోసానిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన రెండేళ్ళ నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. దీనిలో భాగంగా స్థానిక 50వ డివిజన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, స్థానిక డివిజన్ కార్పొరేటర్,నగర మేయర్ షేక్ నూర్జహాన్ ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. మహిళలు హారతులు పట్టారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ఇంటింటి ప్రచార కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని ప్రతి ఇంటికీ వెళ్లిన ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూర్జహాన్‌లు ప్రజలకు రెండేళ్ళ కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన మేళ్ళను వివరించారు. కూటమి ప్రభుత్వం - సంక్షేమ విజయాలు, కోస్తాంధ్ర ప్రగతి పేరుతో రెండేళ్ళ కాలంలో అమలు చేసుకుంటూ వచ్చిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలతో ముద్రితమైన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. అలాగే స్థానిక సమస్యలను సైతం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు రోడ్లు, డ్రైన్ల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా,,, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టనున్నట్లు ఆయన భరోసా కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ రెండేళ్ళ కాలంలో తామేం చేశామో ప్రజలకు వివరించేందుకు ఇంటింటి ప్రచార కార్యక్రమం ఎంతో దోహదమని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ళ కాలంలో వైసీపీ ప్రభుత్వం నిధుల్ని పక్కదారి పట్టించి రోడ్లను నిర్వీర్యం చేసిన పరిస్థితి ప్రజలందరికీ తెలుసునని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని వెల్లడించారు. అదేలక్ష్యంతో 50వ డివిజన్‌లో స్థానికులు తెలిపిన అంతర్గాత రోడ్లు, డ్రైన్ల సమస్యలకు మోక్షం కల్పించేందుకు ప్రధమ ప్రాధాన్యతనిస్తానని ఆయన పేర్కొన్నారు. గతంలో ఉన్న అన్నా క్యాంటీన్లను సైతం రద్దు చేసి పేదల పొట్ట కొట్టిన ఘనత కూడా గత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందంటూ ఆయన ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమాలు రెండుకళ్ళుగా సుస్థిరపాలనకు శ్రీకారం చుడుతూ,,, ఒక్కొక్కటిగా సమస్యలన్నింటికీ పరిష్కరాలు చూపనున్నామని వెల్లడించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే చంటి ప్రజలకు పిలుపునిచ్చారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ గడిచిన రెండేళ్ళ కాలంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వాధినేతలు విశేషంగా శ్రమిస్తున్నారన్నారు. పేదలకు అండగా నిలచే లక్ష్యంతో ఎమ్మెల్యే బడేటి చంటి కూడా ముందుకెళ్తున్నారని, రానున్న కాలంలో సమస్యలన్నింటికీ పరిష్కారాలు చూపనున్నట్లు ఆమె భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, మాజీ డిప్యూటి మేయర్ పప్పు ఉమా, కో క్లస్టర్ ఇంచార్జ్ ఆర్నేపల్లి తిరుపతి, డివిజన్ ఇంచార్జ్ మంత్రి మహాలక్ష్మి నాయుడు, కో డివిజన్ ఇంచార్జ్ సత్తిబాబు,నాయకులు కోరాడ బాలకృష్ణ, సుందరాపు గంగాధర్ రావు, ఊటి రమణ, కొమ్మూరి రమణమ్మ, పొలిమేర కళ్యాణి, బేత కోటేశ్వరరావు, ఏగి రెడ్డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు...