యలమంచిలి : రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని, తక్షణమే బకాయిలు చెల్లించి వారిని ఆదుకోవాలని రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. తాలూకా పెన్షనర్స్ సంఘం సాధారణ సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు సిహెచ్. సోమేశ్వరరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు వి. జగన్నాథరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం పెన్షనర్ల పట్ల చాలా అశ్రద్ధ వహిస్తోందని మండిపడ్డారు. దీనివలన పెన్షనర్లు నెలకు వేలాది రూపాయలు నష్టపోతున్నారని, పెన్షన్ బకాయిలు అందుకోకుండానే చాలామంది వృద్ధులు కన్నుమూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి బి.ఎల్.ఎన్. శర్మ మాట్లాడుతూ.. కీర్తిశేషులు నకార వారు కృషి ఫలితంగా సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన తీర్పు, పెన్షన్ సంఘం చేసిన కృషి ఫలితంగానే కొంత మేర ప్రయోజనం కలిగిందన్నారు. సంఘాన్ని తాలూకా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మరింత బలోపేతం చేయాలని, ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. పెన్షనర్ల తాలూకా అధ్యక్షుడు సోమేశ్వరరావు మాట్లాడుతూ.. సంఘం కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి సొంత భవన నిర్మాణానికి సహకరించాలని కోరారు. సభ్యులందరూ ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా 75 సంవత్సరాలు నిండిన 3 మంది సీనియర్ పెన్షనర్లను సంఘం తరఫున ఘనంగా సత్కరించారు. అనంతరం సంఘ కార్యదర్శి జి. సాంబమూర్తి 2025-26 సంవత్సరానికి సంబంధించిన కార్యదర్శి నివేదికను, ఆర్థిక లెక్కల నివేదికను సభ ముందు ఉంచగా, సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో పెన్షనర్లు హాజరయ్యారు.