వరి విత్తన గుళికలతో ప్రకృతి సాగు 50 మంది రైతులతో లైవ్ డెమో..
19/July/2026 20:22
Share:
అచ్యుతాపురం మండలం, హరిపాలెం గ్రామంలో డిపిఎం లచ్చన్న గారు మరియు రీజనల్ టెక్నికల్ ఆఫీసర్ హేమసుందర్ గారి పర్యవేక్షణలో 50 మంది రైతులతో వినూత్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు రసాయన రహిత సాగుపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు.బీజామృతంతో విత్తన శుద్ధి: వరి నారుమడి వేయడానికి ముందు 50 మంది రైతులచే సామూహికంగా బీజామృతంతో విత్తన శుద్ధి చేయించారు. ఇది తెగుళ్ల నివారణకు మరియు విత్తనం మొలక శాతం పెరగడానికి ఎంతో దోహదపడుతుంది.విత్తన గులికల తయారీ (Seed Pellets): రైతులందరికీ విత్తనాలను గులికలుగా మార్చే పద్ధతిని లైవ్ డెమో ద్వారా వివరించి, వారితోనే స్వయంగా తయారు చేయించి నాటించడం జరిగింది. విత్తన గులికల పద్ధతి వల్ల విత్తనానికి పక్షుల నుండి రక్షణ లభించడమే కాకుండా, భూమిలో తేమ ఉన్నప్పుడు మాత్రమే అవి మొలకెత్తడం వల్ల సాగు సులభతరమవుతుంది.అనుబంధ పంటలు - అంతర సాగు: ఉత్తమ రైతుగా ఎంపికైన ఐదుగురు రైతుల పొలాల్లో 25 సెంట్లు చొప్పున విత్తన గులికలతో వరిని సాగు చేస్తూనే, అనుబంధ పంటలుగా పెసర, మినుము, బొబ్బర, కంది, బెండ వంటి పంటలను సాగు చేయించారు. అలాగే, సహజసిద్ధమైన కలుపు నివారణ కోసం వరుస పద్ధతిలో గోంగూర, తోటకూర వంటి ఆకుకూరలను కూడా సాగు చేశారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటించడం ద్వారా పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవచ్చని, భూసారాన్ని పెంచుకోవచ్చని రైతులను ఉద్దేశించి వివరించారు. రైతులు ఈ పద్ధతులను ఆచరించి రసాయన రహిత పంటలను పండించి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అచ్చుతాపురం మండలం పకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది.