ఏటికొప్పాకలో డ్రంక్ అండ్ డ్రైవ్, గంజాయిపై పోలీసుల అవగాహన...!
30/June/2026 21:33
Share:
మత్తుకు దూరంగా.. ప్రాణాలకు భద్రతగా – ఏటికొప్పాకలో డ్రంక్ అండ్ డ్రైవ్, గంజాయిపై పోలీసుల అవగాహన...! అనకాపల్లి జిల్లా, (క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, యువత, ప్రజాప్రతినిధులు పాల్గొని మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడడం వల్ల రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టం, కుటుంబాల్లో విషాదాలు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. గ్రామంలో ఎక్కడైనా గంజాయి విక్రయాలు, మత్తు పదార్థాల వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవ్ లేదా ఇతర అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించిన వెంటనే ఎలమంచిలి రూరల్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సంప్రదించవలసిన నంబర్లు:ఏఎస్ఐ కె. వీరరెడ్డి – 7013741180,హెచ్‌సీ బి.ఆర్. ప్రసాద్ – 9441571671. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కె. వీరరెడ్డి, హెచ్‌సీ బి.ఆర్. ప్రసాద్, కిసాన్ మోర్చా అధ్యక్షులు శనంశెట్టి శ్రీను, ఎలమంచిలి రూరల్ ప్రచార కార్యకర్త దారా నూకరాజు, కాపు సంఘం అధ్యక్షుడు రామ్ నాయుడు, కాపారపు శాంతరాజ్, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, యువత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.