బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై ఆకస్మిక తనిఖీలు,ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు..!!
28/June/2026 20:06
Share:
క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ : యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. ఎస్సై ఉపేంద్ర ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నవారు, గంజాయి వినియోగిస్తున్న వారిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతంలోని అనుమానాస్పద, నిర్మానుష్య ప్రాంతాలతో పాటు యువత ఎక్కువగా గుమికూడే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.ఈ తనిఖీల్లో బహిరంగంగా మద్యం సేవిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని మొత్తం 4 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేంద్ర తెలిపారు. యువత మత్తు పదార్థాలు, గంజాయికి దూరంగా ఉండాలని, అలాంటి అలవాట్లు జీవితాన్ని నాశనం చేస్తాయని ఆయన సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలిగేలా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం సహించబోమని, ఇలాంటి ఆకస్మిక తనిఖీలు ఇకముందు కూడా నిరంతరం కొనసాగుతాయని హెచ్చరించారు.