ఉపాధి హామీ పని రక్షణకై దేశవ్యాప్త నిరసనలు జయప్రదం చేయండి, ప్రజా సంఘాలు
28/June/2026 20:01
Share:
కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో తీసుకొచ్చిన వీబీ జి రామ్ జి చట్టానికి స్వస్తి పలికి, గతంలో ఉన్న పాత పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ రాము, కౌలు రైతు సంఘం నాయకులు కె రామ సదాశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హరిపాలెంలో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సమావేశం లో మాట్లాడారు.గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు, వ్యవసాయ కూలీలకు ఉపాధిహామీ పథకం ఎంతో ఆసరాగా నిలుస్తోందని అన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 60 శాతం మాత్రమే ఇస్తానని మిగతా 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని మార్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం లేదనే సాకుతో కేంద్రం చేతులు దులుపుకునే పనిచేస్తున్నదన్నారు. ఉపాధిహామీ పథకం రక్షించుకోవడం కోసం జూలై 1 న జరిగే పని ప్రదేశం సచివాలయం ఎంపీడీవో కార్యాలయం వద్ద గ్రామీణ నిరసనలో కార్మికులు, రైతులు, కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.ఈ సమావేశంలో రైతుసంఘం నాయకులు ఎస్ బ్రహ్మాజీ, కన్నుం నాయుడు, సిఐటియు కన్వీనర్ కే సోమునాయుడు, రామ్ కుమార్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.