"ఆర్టీఐ చట్టం"అధికారుల తీరు పై సీసీఆర్ ఎన్‌జీఓ సూటి ప్రశ్న..

"ఆర్టీఐ చట్టం"అధికారుల తీరు పై సీసీఆర్ ఎన్‌జీఓ సూటి ప్రశ్న..

25/June/2026 21:00    Share:   

ఆర్టీఐ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రికార్డులు దాచిపెడుతున్నారా?
 
అవినీతిని కప్పిపుచ్చేందుకే ఈ నిర్లక్ష్యమా? – అధికారుల తీరుపై సీసీఆర్ ఎన్‌జీఓ సూటి ప్రశ్న
 
క్రైమ్ అనాలిసిస్ | టీవీఎస్ ప్రకాష్
 
భోగాపురం మండలం, పోలిపల్లి: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ-2005) కింద కోరిన సమాచారాన్ని 16 నెలలు గడిచినా అందించకపోవడంపై సీసీఆర్ ఎన్‌జీఓ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పోలిపల్లి గ్రామ పంచాయతీ/గ్రామ సచివాలయంలో రికార్డుల వెల్లడిపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది.
 
సీసీఆర్ ఎన్‌జీఓ ప్రతినిధి యడ్ల సూర్యనారాయణ 10-01-2025న ఆర్టీఐ చట్టం ప్రకారం పోలిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన పలు రికార్డులు, సమాచారాన్ని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. అనంతరం పలుమార్లు అప్పీలు, ఫిర్యాదులు చేసినప్పటికీ పూర్తి సమాచారం అందలేదని తెలిపారు.
 
రికార్డుల పరిశీలనకు అవకాశం కల్పించినప్పటికీ, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక రికార్డులు అందుబాటులో ఉంచలేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు సమాచారం అందించాలని ఆదేశించినా అమలు జరగలేదని, చివరకు 27-04-2026న జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు.
 
దరఖాస్తు చేసిన తేదీ నుంచి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తేదీ వరకు దాదాపు 16 నెలలు గడిచినా పూర్తి సమాచారం అందించకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని సీసీఆర్ ఎన్‌జీఓ పేర్కొంది.
 
ఈ సందర్భంగా సీసీఆర్ ఎన్‌జీఓ ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్, ఉమ్మడి విజయనగరం జిల్లా ఇంచార్జ్ కర్రోతు రాము మాట్లాడుతూ, ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని అందించడం అధికారుల చట్టబద్ధ బాధ్యత అని అన్నారు. ఆర్టీఐ దరఖాస్తులు, అప్పీలు, ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడం ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు.
 
“రికార్డులు సక్రమంగా ఉంటే ఎందుకు చూపించడం లేదు? ఆర్థిక రికార్డుల పరిశీలనకు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు? సమాచారం ఇవ్వడంలో ఇంత జాప్యం వెనుక అసలు కారణం ఏమిటి?” అని ప్రశ్నించారు.
 
సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు తీసుకొచ్చిన చట్టమని, దానిని గ్రామస్థాయిలో సక్రమంగా అమలు చేయకపోవడం ప్రజల హక్కులను హరించడమేనని సీసీఆర్ ఎన్‌జీఓ అభిప్రాయపడింది.
 
జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని పూర్తి స్థాయి విచారణ జరిపి, పెండింగ్‌లో ఉన్న సమాచారాన్ని వెంటనే అందించడంతో పాటు ఆర్టీఐ చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, పోలిపల్లి గ్రామ పంచాయతీ ఆర్థిక రికార్డులపై సమగ్ర విచారణ నిర్వహించాలని సీసీఆర్ ఎన్‌జీఓ డిమాండ్ చేసింది.
 
ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాచార హక్కు చట్టం వెన్నెముక వంటిదని, ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో అందించడం అధికారుల బాధ్యత అని కర్రోతు రాము, యడ్ల సూర్యనారాయణ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Breaking News

Subscribe our Newsletter