
అనకాపల్లి పట్టణంలో నిర్వహించిన కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ ర్యాలీ విశేష విజయాన్ని సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి విస్తృత ఆదరణ లభిస్తోందని నాయకులు పేర్కొన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు, జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. తీవ్ర ఎండలను లెక్కచేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం కూటమిపై ఉన్న ప్రజాభిమానానికి నిదర్శనమని నాయకులు అభిప్రాయపడ్డారు.నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజల మద్దతుతో మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. వైసీపీ అధినేత జగన్ రెడ్డి చేస్తున్న విమర్శలు ప్రజలు విశ్వసించడం లేదని, కూటమి ప్రభుత్వ పనితీరుకు ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్, వెలమ కార్పొరేషన్ చైర్మన్ పి.వి.జి. కుమార్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.ర్యాలీ విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వర కృతజ్ఞతలు తెలిపారు.