అనకాపల్లి:
పట్టణంలోని గాంధీ కూరగాయల మార్కెట్ పరిధిలో ట్రాఫిక్ సమస్యల నివారణకు ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరించాలని అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ (సీఐ) ఎం. వెంకట నారాయణ పిలుపునిచ్చారు. గాంధీ వెజిటబుల్ మార్కెట్ ప్రాంగణంలో మంగళవారం ఆయన ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ వెంకట నారాయణ మాట్లాడుతూ.. మార్కెట్‌కు వచ్చే ప్రజలు, కొనుగోలుదారులు ఎవరికి వారు బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. రహదారులపై ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని, సదరు వాహనదారులపై ట్రాఫిక్ చలానాలు విధిస్తామని స్పష్టం చేశారు. మార్కెట్‌కు వచ్చే వారు తమ వాహనాలను డీసీఎంఎస్ (DCMS) స్థలంలోనే పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.
అనంతరం మార్కెట్ వీధుల్లోని తోపుడు బండ్ల నిర్వాహకులు, రోడ్డు పక్కన ఉన్న షాపుల యజమానులతో ఆయన మాట్లాడారు. రోడ్లను ఆక్రమించకుండా, ఇతరులకు ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు చేసుకోవాలని హెచ్చరించారు. పట్టణంలో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సీఐ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, స్థానిక వ్యాపారులు, వినియోగదారులు పాల్గొన్నారు.