హైటెన్షన్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం..!!  18 మంది ప్రయాణికులు క్షేమం..!!!

హైటెన్షన్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం..!!  18 మంది ప్రయాణికులు క్షేమం..!!!

06/April/2026 07:33    Share:   

హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం: 18 మంది ప్రయాణికులు సురక్షితం
వేంపల్లి (కడప జిల్లా): కడప జిల్లా వేంపల్లి మండలం వీరన్నగట్టు పల్లె సమీపంలో తృటిలో భారీ ప్రాణాపాయం తప్పింది. కడప నుంచి కదిరి వైపు వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు, పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది.
డ్రైవర్ అప్రమత్తత - తప్పిన ముప్పు:
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. విద్యుత్ తీగలు తగలడాన్ని గమనించిన బస్సు డ్రైవర్, వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేసి ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. ప్రయాణికులందరూ కిందకు దిగిన కొద్ది క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణమా?
స్థానికుల కథనం ప్రకారం.. ఇటీవల ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. దీనివల్ల రోడ్డు స్థాయి సుమారు 3 అడుగుల ఎత్తు పెరిగింది. అయితే రోడ్డు ఎత్తు పెరిగినప్పటికీ, పైన ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ల ఎత్తును పెంచడంలో అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహించారు. విద్యుత్ తీగలు కిందికి వేలాడుతున్నా, ఎటువంటి ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
బాధ్యులపై చర్యలకు డిమాండ్:
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ, ఆర్ అండ్ బి అధికారులు స్పందించి లైన్ల ఎత్తును సరిచేయకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

రిపోర్టింగ్: క్రైమ్ అనాలిసిస్, టీవీఎస్ ప్రకాష్, యలమంచిలి.
Breaking News

Subscribe our Newsletter