జలధార-జలహారతి కార్యక్రమంలో అవకతవకలకు పాల్పడితే సస్పెన్షన్ తప్పదు
కాల్వలు, చెరువులలో నీటి నిల్వ సామర్థ్యం పెంచేలా పూడికతీత రెండు అడుగుల మేరకు చేయాలి
జలధార-జలహారతి గ్రామాల్లో అర్హత కలిగిన అన్ని పనులు గుర్తించి పనులు ప్రతిపాదించాలి
మంజూరై ఇంకా ప్రారంబించని పనులను వెంటనే ప్రారంభించాలి
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, :
జిల్లాలో జలధార- జలహారతి కార్యక్రమంలో అవకతవకలకు పాల్పడితే సస్పెన్షన్ తప్పదని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశమందిరంలో శనివారం జలధార- జలహారతిలో పోలవరం నియోజకవర్గంలోని ఏడు మండలాలు, చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి, టి.నర్సాపురం మొత్తం తొమ్మిది మండలాలు మండలాలు వారీగా పనుల ప్రగతిపై జిల్లా కలెక్టరు సమీక్ష అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో జలధార- జలహారతి కాల్వలు, చెరువులలో పూడికతీత పనులను సక్రమంగా చేపట్టడంలేదని తన దృష్టికి వచ్చిందన్నారు. ఎంపిడిఓలు, డ్వామా, ఇరిగేషన్ అధికారులు పనులు నిబంధనల మేరకు పూర్తి అయ్యాయా లేదా అన్నది పరిశీలించకుండా, కేవలం 6 అంగుళాలు పూడికతీత పనులను కూడా పనులు పూర్తి అయినట్లుగా చూపిస్తున్నారన్నారు. కనీసం 2 అడుగుల మేర పూడికతీత తీస్తేనే వాటిలో నీటినిల్వ సామర్థ్యం గతం కన్నా పెరుగుతుందని, జలధార కార్యక్రమం ఉద్దేశ్యం నెరవేరుతుందని, అధికారులు ఆ దిశగా పనిచేయాలన్నారు. జలధార- జలహారతి కార్యక్రమంలో నిర్లక్ష్యం, అలసత్వం వ్యవహరిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు చేపట్టిన పనులలో తక్కువ స్థాయిలో పూడికతీత పనులు గుర్తించి వాటిల్లో నిబంధనలతో నిర్దేశించిన మేరకు పూడికతీసి తరవాతే మాత్రమే పనులు పూర్తిచేసి నివేదిక సమర్పించాలన్నారు. కొన్ని మండలాలు లక్ష్యాలు సాధించుటలో వెనుకబడి ఉన్నారని, పద్ధతి మార్చుకోవాలని లేదంటే సస్పెండు చేస్తానని జిల్లా కలెక్టరు హెచ్చరించారు. జలధార- జలహారతి పనులు నాణ్యత ప్రమాణాలను పాటించాలని, నాణ్యత లోపిస్తే విజిలెన్స్ శాఖా ద్వారా తనిఖీలు ఉంటాయని హెచ్చరించారు. పనులు పూర్తయిన అనంతరం సంబంధిత డ్వామా, ఇరిగేషన్ సిబ్బంది, ఎంపిడిఓ లు ధృవీకరించి నివేదికలు పంపాలన్నారు. పనుల నాణ్యతలోపిస్తే సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తానన్నారు. జిల్లాలో జలధార- జలహారతి కార్యక్రమంలో చేపట్టిన పనులు జూన్ 15వ తేదీ నాటికి నూరుశాతం పనులను పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టరు అధికారులను ఆదేశించారు. జూన్ రెండవ వారం వర్షాలు ప్రారంభం కానున్న దృష్ట్యా, కురిసిన ప్రతీ నీటి బొట్టును పరిరక్షించుకునేందుకు పనులు త్వరితగతిన పూర్తి చెయ్యాలని అన్నారు. పనులు ప్రారంభించక ముందు, పనులు పురోగతిలో ఉన్నప్పుడు, పూర్తి ఐన తరవాత ఫోటోలు తీసి ఆన్లైన్ లో అప్లోడ్ చెయ్యాలని జిల్లా కలెక్టరు అధికారులను ఆదేశించారు. మంజూరైన పనులలో ఇంకా ప్రారంభించని పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. గ్రామాల్లో జలధార-జలహారతి కార్యక్రమంలో ద్వారా చేపట్టేందుకు అర్హత కలిగిన అన్నిపనులు గుర్తించి పనులను ప్రతిపాదించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో డ్వామా పిడి కె.వెంకట సుబ్బారావు, అదనపు పిడి రాజశేఖర్, ఏపిడి ఆర్. విక్టర్, ఇరిగేషన్ ఈఈ గనిరాజు, డ్వామా, ఇరిగేషన్ అధికారులు, ఎంపీడీఓలు, ఏపీవో లు, తదితరులు పాల్గొన్నారు.